కోరిక తీర్చలేదని..బాలింతను చంపిన భర్త | wife killed by husband | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చలేదని..బాలింతను చంపిన భర్త

Published Mon, Sep 2 2013 12:54 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

wife killed by husband

గండేడ్, న్యూస్‌లైన్: పచ్చి బాలింత అయిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త కళ్లు కామంతో మూసుకుపోయాయి. తన వాంఛ తీర్చలేదని కట్టుకున్న ఇల్లాలినే గతునులిమి కడతేర్చిన ఘటన ఆదివారం గండేడ్ మండలం కంచన్‌పల్లిలో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దిర్శం వెంకటయ్య(35), చెన్నమ్మ(28) దంపతులు. తమకున్న రెండెకరాల్లో వ్యవసాయంతో పాటు స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పిల్లలు ప్రియాంక(6), చెన్నకేశవులు(4) ఉన్నారు. 11 రోజుల క్రితం చెన్నమ్మ కంచన్‌పల్లిలో మరో పాపకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో వెంకటయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తన కోరిక తీర్చాలంటూ భార్యను వేధించాడు. చెన్నమ్మ అంగీకరించకపోవడంతో గొంతునులిమి చంపేశాడు.
 
  అదే సమయంలో మెలకువతో ఉన్న పెద్దకూతురు ప్రియాంక ‘నాన్నా అమ్మను ఏం చేయొద్ద’ంటూ ఎంత ప్రాధేయపడినా ఆ కర్కోటకుడి హృదయం ద్రవించలేదు. భార్యను చంపిన అనంతరం వెంకటయ్య అక్కడే పడుకున్నాడు. పాల కోసం రాత్రంతా పసికందు గుక్కపట్టి ఏడ్చినా పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం నిద్రలేచిన వెంకటయ్య ఇల్లు, వాకిలీ శుభ్రం చేశాడు. తన ఘాతుకాన్ని వరుసకు అల్లుడయ్యే వ్యక్తికి చెప్పి.. ఈ విషయాన్ని తన అత్తగారికి చెప్పాలన్నాడు.  కూతురి హత్య విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు మహబూబ్‌నగర్ జిల్లా దమ్మాయిపల్లి నుంచి వ చ్చారు. పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, మహమ్మదాబాద్ ఎస్‌ఐలు వివరాలు సేకరిం చారు. వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా పైవివరాలు తెలిపాడు. మృతురాలి పెద్దకూతురు ప్రియాంక ఘటనను కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పడంతో గ్రామస్తులు, బంధువులు అయ్యో పాపం అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. చెన్నమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. తల్లి మృతితో పసికందును ఐసీడీఎస్, అంగన్‌వాడీ అధికారులు తాండూరులోని శిశువిహార్‌కు తరలించారు. తల్లి హత్య.. తండ్రి జైలు పాలవడంతో పిల్లలు అనాథలవుతారని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.  కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement