టీడీపీ ఎమ్మెల్యేపై మరోసారి భార్య ఫిర్యాదు
విజయవాడ : కృష్ణాజిల్లా కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణపై ఆయన భార్య సునీత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన భార్య సునీత తన భర్త నుంచి ప్రాణభయం ఉందని రెండో సారి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ప్రాణభయం ఉందంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సునీత తన భర్త నుంచి వేరుగా ఉంటున్నారు. మూడు నెలల పాటు మెయింటెనెన్స్‌తో పాటు భార్య, పిల్లల ను చక్కగా చూసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటించకుండా.. మళ్లీ వేధింపులు ప్రారంభించారని సునీత చెబుతున్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ గతంలో రెండు కేసులు నమోదు అయ్యాయి. భార్య సునీత ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు ఆయనపై తొలుత గృహహింస చట్టం-498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విషయం న్యాయస్థానానికి వెళ్లిన తర్వాత మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నానికి ప్రయత్నించారనే ఆరోపణపై 307, బలవంతంగా విడాకుల పత్రాలపై సంతకాలు తీసుకున్నారనే ఆరోపణపై 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
2012లో భార్యభర్తలు ఇద్దరు తమకు విడాకులు మంజూరు చేయాలని సీనియర్ సివిల్ జడ్జిని ఆశ్రయించటంతో వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్యా భర్తలిద్దరూ కోర్టుకు హాజరవగా, తనకు విడాకులు వద్దని సునీత జడ్జికి విన్నవించిన విషయం తెలిసిందే.