శాడిస్టు ప్రేమికుల్లా సీమాంధ్ర నేతల కుట్రలు
టీఎన్జీవోల నేత దేవీప్రసాద్
హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చాలని చూస్తే మరో మహోద్యమం తప్పదని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ దేవీప్రసాద్‌రావు హెచ్చరించారు. యూటీ చేయడంవల్ల ప్రభుత్వంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం రద్దవుతుందని, దీన్ని సహించబోమన్నారు. ముల్కీ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్‌లో శాంతి ర్యాలీ, దీక్షల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన టీఎన్జీవోల భవనంలో మీడియాతో మాట్లాడారు. తమకు దక్కనిది ఇతరులకు దక్కకూడదన్న శాడిస్టు ప్రేమికుల్లాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో 7న జరుపతలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని 10 రోజుల ముందే అనుమతి కోరితే నిరాకరించిన ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు మాత్రం ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు అనుమతి కుట్రే
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విభజన వద్దంటూ సభ నిర్వహించడం రెచ్చగొట్టడమేనని, హైదరాబాద్‌ను అశాంతి నగరంగా మార్చే కుట్రలో భాగంగానే ఈ సభకు అనుమతిచ్చారని ఆరోపించారు. తాము గతంలో ఎప్పుడు సభలకు అనుమతి కోరినా చివరి నిమిషం వరకు తేల్చకుండా ఇబ్బంది పెట్టిన పోలీసులు నాలుగు రోజుల ముందే ఈ సభకు ఎలా అనుమతిస్తారన్నారు. అసెంబ్లీ వద్ద గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల ఆందోళనలకు అనుమతించలేదని, మంగళవారం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ధర్నాకు మాత్రం పోలీసులు దగ్గరుండి రక్షణ కల్పించారన్నారు. ప్రభుత్వమే సీమంధ్ర ఉద్యమాన్ని నడుపుతోందన్న విషయం ఇప్పుడు రుజువైందని చెప్పారు. శాంతి ర్యాలీకి టీ మంత్రులే అనుమతి ఇప్పించాలని, ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలకైనా టీ మంత్రులే బాధ్యత వహించాలన్నారు. అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. ఉద్యోగుల అపోహలను కేంద్రం పరిష్కరించాలని దేవీప్రసాద్ కోరారు.