ఈ నెలలోనే ఫేకర్ సమస్య పరిష్కరిస్తా..మంత్రి మృణాళిని
గరివిడి : ఈ నెలాకరుకల్లా ఫేకర్ లాకౌట్‌ను ఎత్తివేసే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణాశాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన మంత్రి మృణిళినిని ఫేకర్ కార్మికులు కుటుంబ సభ్యుల తో కలిశారు. ఏడు నెలల కిందట ఫేకర్ పరిశ్రమను లాకౌట్ చేయడంతో పస్తులుండాల్సి వస్తోందని కార్మికు లు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి మంతి స్పందిస్తూ, ఈ నెలలో లేబర్ కమిషనర్, కార్మిక శాఖ మంత్రి, ఫేకర్ యాజమాన్యం, కార్మికుల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే కార్మికులు కూడా పట్టు విడుపుతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల వైస్ ఎంపీపీ బలగం వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
‘పెద్ద చెరువుకు శాశ్వత ర్యాంప్ నిర్మించాలి’
విజయనగరం మున్సిపాలిటీ : ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే పైడితల్లమ్మ తెప్పోత్సవానికి పెద్ద చెరువు వద్ద శాశ్వత ర్యాంప్ నిర్మించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీవీ రమణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణా శాఖ మంత్రి కిమిడి మృణాళినికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, తెప్పోత్సవానికి సంబంధించి ప్రతి సం వత్సరం పెద్ద చెరువు వద్ద తాత్కాలిక ర్యాంప్ నిర్మించడానికి డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అయితే అవసరం తీరాక పట్టించుకోకపోవడంతో ర్యాంప్ పాడవుతోందన్నారు.
ఇప్పటికైనా శాశ్వత ర్యాంప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల న్నారు. మినర్వా థియేటర్ నుంచి ఆలయం వరకు, అదేవిధంగా మూడు లాంతర్ల జంక్షన్ నుంచి అర్బన్ బ్యాంకు వరకు తాటాకుల పందిరి వేయాలని కోరారు. పండుగ రోజుల్లో మున్సిపల్ కుళాయిల ద్వారా ఆటం కం లేకుండా నీటి సరఫరా చేపట్టాలన్నారు. వీఐపీ పాస్ లు తగ్గించి సామన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు
పాల్గొన్నారు.