
మహిళపై పోలీసుల దాష్టీకం
సాక్షి, విజయవాడ: రాత్రిపూట ఇంటికెళ్తున్న మహిళపై విజయవాడ నగర కమిషనరేట్ పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. మద్యం సేవించి గలాటా చేస్తోందంటూ చితకబాది కేసు నమోదు చేశారు. తనకు అన్యాయం జరిగిందని కమిషనర్‌కు చెప్పడానికి వెళ్తే మరోసారి ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో బాధిత మహిళ గాయాలతోనే విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల సహకారంతో ఏసీబీ న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది. న్యాయమూర్తి కేసును విచారణకు స్వీకరించి ఈ నెల 26కు వాయిదా వేశారు. వైద్యం చేయించుకోవాలని, ఆమెకు చేసిన ట్రీట్మెంట్ రికార్డులు కోర్టుకు సమర్పించాలని వైద్యులను ఆదేశించారు. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వివరించింది.
రాత్రిపూట వెళ్తుంటే చితకబాదారు: విజయవాడలోని రామలింగేశ్వరనగర్లోని రఘురోడ్డులో తాను నివాసముంటున్నానని బాధిత మహిళ తెలిపింది. ఈ నెల 22న రాత్రి 11 గంటలకు పడమటలోని ఓ కల్యాణ మండపంలో పని చేసుకొని ఇంటికి వెళ్లేందుకు అక్కడి బస్టాండ్ వద్దకు చేరుకున్నానని, ఈ క్రమంలో నలుగురు యువకులు తనను అనుసరించారని తెలిపింది. విషయాన్ని అక్కడే నైట్‌డ్యూటీ విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు తెలుపగా.. పడమట ఎస్ఐ మోహన్రావు వస్తున్నారని అక్కడే ఉండాలని చెప్పారంది. ఎస్ఐ వచ్చి తనను అనుసరించిన యువకుల్ని విచారించి పంపించారని, అనంతరం తనను స్టేషన్కు తరలించి చితకబాది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వెళ్లిపొమ్మన్నారని తెలిపింది. దీనిపై నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి కమిషనరేట్‌కు వెళ్లగా అక్కడి సిబ్బంది వెనక్కు పంపేశారంది. అనంతరం ఆస్పత్రికి వెళితే గేటు వద్ద ఎస్ఐ మోహన్రావు, ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకొని బలవంతంగా జీపులో ఎక్కించి రామవరప్పాడు రింగ్ వద్ద మళ్లీ కొట్టి బలవంతంగా మందు తాగించి తప్పుడు కేసు పెట్టినట్లు బాధితురాలు వివరించింది.
ఆమె ఓ వ్యభిచారిణి: దామోదర్, పడమట సీఐ
ఆ మహిళ ఓ వ్యభిచారిణి. ఆమె గురించి రామలింగేశ్వరనగర్లో విచారిస్తే ఎవరైనా చెబుతారు. పడమట సెంటర్లో మద్యం సేవించి గలాటా సృష్టిస్తుంటే మా ఎస్ఐ వెళ్లి స్టేషన్‌కు తీసుకువచ్చి సెక్షన్ 294 కింద వ్యభిచారం కేసు నమోదు చేశారు. మా సిబ్బంది ఆమెను కొట్టి గాయపర్చలేదు. ఇదంతా ఆమె కావాలనే చేస్తోంది.