పశ్చిమగోదావరి, ఆకివీడు: జీతం ఒక చోట.. విధులు మరొకచోట.. పాలకులు పగబడితే ఎంతటి ఉద్యోగికైనా ఇటువంటి తిప్పలు తప్పవనటానికి ఆకివీడు ఎంపీడీఓగా పనిచేసిన సీతామహాలక్ష్మి నిదర్శనం. రెండు కళ్ల సిద్ధాంతంతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారనడానికి ఈ ఎంపీడీఓకు జరిగిన అన్యాయం ఓ నిదర్శనం. ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని అధికారులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల విభజనలో సీతామహాలక్ష్మిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. కొన్నాళ్లు అక్కడ పనిచేసిన ఆమె తరువాత తన సొంత రాష్ట్రమైన ఆంధ్రా చేరుకున్నారు.
సొంత గడ్డకు వచ్చానన్న ఆనంద భాష్పాలు ఆమె కళ్లల్లో కనిపించిన కొన్నాళ్లకే అవి కన్నీరుగా మారిపోయాయి. ఆకివీడు ఎంపీడీఓగా పనిచేస్తున్న తెలంగాణవాసి నాయిని శ్రీనాథ్‌ను రాజధాని అమరావతికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో గతేడాది ఎంపీడీఓగా సీతామహాలక్ష్మి ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన 24 గంటలకే ఆమెను ఆకివీడు నుంచి ఉండి మండల పరిషత్‌కు డెప్యూటేషన్‌పై బదిలీ చేయించారు. అయితే అక్కడ కూడా పనిచేసేందుకు ఆమెకు అవకాశం దక్కనివ్వలేదు. అక్కడ ఐదారు నెలలు మాత్రమే ఆమె పనిచేశారు. అక్కడ నుంచి ఏలూరు డీఆర్సీకి బదిలీ చేశారు. ఏలూరులో పనిచేస్తున్న సీతామహాలక్ష్మి ఆకివీడు మండల పరిషత్‌లోనే జీతం తీసుకుంటున్నారు. మండలస్థాయి అధికారికే స్థానం లేకుండా చేస్తే చిరుద్యోగుల పరిస్థితి ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎఫ్‌ఏసీతోనే పాలన
ఏడాదిన్నర నుంచి ఆకివీడు ఎంపీడీఓ పోస్టును పూర్తి అదనపు బాధ్యతల(ఎఫ్‌ఏసీ)తో సూపరింటెండెంట్‌కు అంటగట్టారు.మునిసిపాలిటీ స్థాయికి ఎదిగిన ఆకివీడులో పరిపాలన సాగించడానికి సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి సరిపోతాడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఒక్కరోజు ఎంపీడీఓ
ఒక్క రోజు ఎంపీడీఓగా పనిచేసిన అధికారిని ఆకివీడు మండల ప్రజలు చూశారు. మండల స్థాయి అధికారి ఒక్కరోజు పనిచేసి వెళ్లిపోవడంతో ఆమెను ప్రజలు కూడా మరిచిపోయారు.
మహిళా ఉద్యోగికి ఇన్ని తిప్పలా?
మండలాభివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చిన మహిళా ఉద్యోగిని ఇన్ని తిప్పలు పెట్టడం సమంజసం కాదు. జీతం ఒక చోట, విధులు మరొక చోట.. సేవలందించడానికి వచ్చిన ఉద్యోగిని ఇబ్బందుల పాల్జేయడం సరికాదు. టీడీపీ పాలనలో ఆడపడుచులకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఆ ఎంపీడీఓకు ఆకివీడులోనే పోస్టింగ్ ఇవ్వాలి.–మోరా జ్యోతిరెడ్డి,ఎంపీటీసీ సభ్యురాలు, ఆకివీడు
ఇది సరైన పద్ధతి కాదు
సొంత గడ్డపై సేవలందించేందుకు వచ్చిన ఉద్యోగినిని రాజకీయ కారణాలతో తిప్పలు పెట్టడం సరికాదు. మండల స్థాయి అధికారిలో ఈ విధంగా ఎక్కడెక్కడో పనులు చేయించుకోవడం దారుణం. జీతం ఒక చోట, పనులు మరొకచోట. పాలకులు ఇలా ఆడుకోవడం సరైన పద్ధతి కాదు.–డి.కల్యాణి, డెల్టా జిల్లా కార్యదర్శి, ఐద్వా
Comments
Please login to add a commentAdd a comment