
ఆపరేషన్ సరిగా చేయరేమోనని రోదిస్తూ చైర్‌పర్సన్‌కు మొరపెట్టుకుంటున్న మంగమ్మ
మచిలీపట్నంటౌన్(మచిలీపట్నం): తన కుమారుడి కాలికి గాయమైందని, ఆపరేషన్ చేసేందుకు ఎముకల డాక్టర్ డబ్బు అడుగుతున్నారని ఓ మహిళ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధకు ఫిర్యాదు చేశారు. అనూరాధ మంగళవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనూరాధ మంగళవారం ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించారు. వార్డుల్లో ఉన్న రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ప్రభుత్వాసుపత్రిలో 70 శాతం మేర సిజేరియన్లు జరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముచ్చులగుంట గ్రామానికి చెందిన జంగం మంగమ్మ జెడ్పీ చైర్‌పర్సన్ వద్దకు వచ్చి తన కుమారుడు కాలికి గాయం కావటంతో ఆపరేషన్ అవసరమైందని, ఆపరేషన్ చేసేందుకు ఎముకల వైద్యుడు వినయ్‌కుమార్ నగదు అడిగారని ఫిర్యాదు చేశారు.
స్పందించిన అనూరాధ వెంటనే డాక్టర్ వినయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గతంలోనూ మీపై పలుమార్లు అవినీతి ఆరోపణలు వచ్చాయి. సరిచేసుకుంటారులే అని అనుకుంటున్నా మారటం లేదు. ఇలా అయితే పేద రోగులకు వైద్యం ఎలా అందుతుంది?’ అని ప్రశ్నించారు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను డబ్బు అడగలేదని వినయ్‌కుమార్ బదులిచ్చారు. మంగమ్మ ఎముకల వార్డుకు వెళ్లి ఆధార్‌కార్డు తీసుకువచ్చే క్రమంలో డబ్బులు అడగలేదని చెప్పాలంటూ ఆమెను కొంతమంది ఆమెను హెచ్చరించారు. దీంతో మంగమ్మ చైర్‌పర్సన్ కాళ్లు పట్టుకుని రోదిస్తూ తన కుమారుడికి ఆపరేషన్ సరిగా చేయరేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ జరిగే సమయంలో తాను కూడా అక్కడే ఉంటానని, భయపడొద్దని ఆసుపత్రి ఆర్‌ఎంవో అల్లాడ శ్రీనివాసరావు మంగమ్మకు హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్ వెంట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సోమశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.జయకుమార్, కమిటీ సభ్యులు బోయిన వెంకటకృష్ణరాజు, అంగర తులసీదాసు, జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.