
‘పనికట్టు’ విద్య
‘పనికట్టు’ విద్య
రాజమండ్రి కార్పొరేషన్,:
ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు భ్రమింపజేసే విద్యను ‘కనికట్టు’ అంటారు. మరి.. అవసరం ఉన్నా, లేకపోయినా రూ.కోట్లతో పనులు చేయించడాన్ని ‘పనికట్టు’ అనొచ్చేమో. కనికట్టు చేసే వారు ప్రదర్శన ముగిశాక ప్రేక్షకులను అభ్యర్థించి రూపాయో, రెండో తీసుకుంటారు.
అయితే రాజమండ్రి నగర పాలక సంస్థలోని ‘పనికట్టు’ విద్యాపారంగతులు దర్జాగా పర్సంటేజీలు దండుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి, దాంతో పాటు అలాగే ఎన్నికల కోడ్ వెలువడక ముందే.. గతంలో మంజూరైన నిధులను ‘ఎలాగోలా’ ఖర్చు చేయాల్సిన తొందరను తమకు అనుకూలంగా మలచుకున్న అధికారులు ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే నగరంలో ఎక్కడ పడితే అక్కడ, అవసరంతో నిమిత్తం లేకుండా ‘అభివృద్ధి’ పనులు జరిగిపోతున్నాయి. ఇటీవలే ఇక్కడి నుంచి స్థానచలనం పొందిన ఓ ఉన్నతాధికారి ‘గోదావరి తీరాన ఉండగానే తన ‘సిరి’ని పండించుకోవాలని టెండర్లు పిలిచి, తానుండగానే పనులు కట్టబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం సుమారు రూ.27 కోట్ల(ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సహా)తో పనులు జరిగిపోతున్నాయి. అవసరమైన చోట, అవసరమైన పనులు జరిగితే వేలెత్తి చూపే పనేలేదు. అయితే కేవలం ఓ ప్రజాప్రతినిధి, స్థానచలనం పొందిన ఉన్నతాధికారీ పర్సంటేజీల కోసం అవసరం లేని పనులు కూడా హడావుడిగా చేయించేస్తున్నారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం తదితర పనులు నగరంలోని ప్రతి డివిజన్‌లో జరుగుతున్నాయి. అయితే పనుల్లోనాణ్యత లోపిస్తోందని, ఎక్కడా అవసరం మేరకు పనులు జరగడం లేదని స్థానికులు అంటున్నారు. అవసరం లేని చోట పూర్తిస్థాయిలో బీటీ రోడ్లు నిర్మిస్తున్నారని, పటిష్టంగా ఉన్న డ్రైనేజీలను తవ్వేసి, వాటిని వెడల్పు చేస్తూ అభివృద్ధి చేస్తున్నట్టు భ్రమింపజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు ‘రింగైనట్టు’ తెలిసినా.. ప్రజాధనం ‘బూడిదలో పోసిన పన్నీరు’ అయితేనేం.. సదరు ప్రజా ప్రతినిధి, అధికారి తమ పర్సంటేజీలే పరమార్థం అనుకున్నారు. ఆ ప్రజాప్రతినిధికి 10 శాతం, స్థాన చలనం పొందిన అధికారికి ఒక శాతం, ఇతర అధికారులకు 2 శాతం చొప్పున కాంట్రాక్టర్లు చెల్లించినట్టు సమాచారం.
పనులను లాటరీ వేసుకున్నారు..
ఈ పనులను దక్కించుకునేందుకు నగరంలోని కాంట్రాక్టర్లంతా ‘ఒక్కటై’ బయటి వారికి అవకాశం లేకుండా చేశారు. దీని కోసం చాలా రోజులు కసరత్తు చేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలు చేయాలి. అయితే కోట్ల రూపాయల పనులను దక్కించుకునేందుకు రింగైన కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసుకున్న సంఘం పేరుతో ఆన్‌లైన్ ద్వారా టెండర్లు వేసి, తరువాత పనులను లాటరీ పద్ధతిలో పంచేసుకున్నారు. దీనిలో ప్రజాప్రతినిధి ‘హస్తం’తో పాటు స్థానచలనం పొందిన అధికారి, ఇంజనీరింగ్ విభాగం అధికారుల సహకారం ఉన్నట్టు సమాచారం. ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా బయటి వారు కూడా టెండర్లు వేస్తే ఎవరు తక్కువకు వేస్తే వారికే పనులు దక్కేవి. దీంతో నగరపాలక సంస్థ సొమ్ము చాలా వరకూ ఆదా అయ్యేది. కానీ ఇక్కడి కాంట్రాక్టర్లంతా కుమ్మక్కయి, కొత్త వారెవరూ టెండర్లు వేయకుండా ఫోన్ల ద్వారా బెదిరించినట్టు సమాచారం. తదుపరి ఎవరి వాటాలు వారికి ముట్టజెప్పినందునే.. పనుల్లో నాణ్యత అణుమాత్రం లేకపోయినా ఎవరూ వీసమెత్తు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రూపాయీ సద్వినియోగం అయ్యేలా చూసి, నగరాభివృద్ధికి దోహదపడాల్సిన వారే అలాంటి ‘మంచి ఆలోచనలను’ గోదాట్లో కలిపేసి.. తాము మాత్రం డబ్బు మూటలు నింపుకుంటున్నారన్న మాట.