విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండంలోని హెచ్‌బీఎల్‌లో కార్మాగారంలో బుధవారం ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు.
విజయనగరం: ప్రమాదవశాత్తూ ఐరన్ రాడ్డు మీదపడి తాత్కాలిక కార్మికుడు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండంలోని హెచ్‌బీఎల్‌లో కార్మాగారంలో బుధవారం జరిగింది. వివరాలు.. నెల్లిమర్ల మండలం గుస్ని గ్రామానికి చెందిన జమ్ము రమణ(43) హెచ్‌బీఎల్‌లో తాత్కాలిక కార్మికునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు కార్మాగారంలో ఐరన్ పోల్స్‌ను తరలించే క్రేన్ బెల్ట్ పక్కన విధులు నిర్వర్తిస్తున్న రమణపై ఐరన్ రాడ్డు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
కార్మికులకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందనే ఉద్ద్దేశ్యంతో యాజమాన్యం వెంటనే రమణ మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించింది. కాగా.. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడతోనే ఈ ప్రమాదం జరిగిందని.. క్రేన్ బె ల్ట్(పట్టా) తెగడంతోనే రమణ మృతిచెందాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. బాదితునికి నష్ట పరిహారం చెల్లించడంతో పాటు సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా చేస్తున్నారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు.