వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్ర, శనివారాల్లో జిల్లాలో సమైక్యశంఖారావం యాత్రలో జగన్ పాల్గొంటారు.
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్ర, శనివారాల్లో జిల్లాలో సమైక్యశంఖారావం యాత్రలో జగన్ పాల్గొంటారు. ఈ విషయాన్ని పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఆత్మకూరు, కావలి, గూ డూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలతో కలిసి ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్ పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు నాయుడుపేట బహిరంగ సభలో జగన్ పాల్గొంటారన్నారు. సాయంత్రం 3 గంటలకు మనుబోలు సభలో, 6 గంటలకు గూడూరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారన్నా రు. రాత్రికి గూడూరులో బస చేస్తారని ఎంపీ చెప్పారు. ఫిబ్రవరి 1న ఉదయం 10కి వెంకటగిరిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం 6కు ఆత్మకూరు బహిరంగ సభలో మాట్లాడుతారని ఎంపీ తెలిపారు. అనంతరం జగన్ పులివెందులకు వెళుతారన్నారు. సమైక్య శంఖారావం యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులుకు, సమైక్యవాదులకు ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో జగన్ యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు.
నెల్లూరులో అంతకు మించి విజయవతం చేయాలని కోరారు. జగన్ యాత్ర విజయవంతానికి నియోజక వర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని మేకపాటి కోరారు. పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఒక్కటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు.
సమైక్యవాద పార్టీ అధినేతగా జిల్లాలో జరగనున్న జగన్ శంఖారావం యాత్రను పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు విజయవంతం చేయాలని మేరిగ మురళీధర్ కోరారు. ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజక వర్గంలో గత సంవత్సరం డిసెంబర్ 22 నుంచి పాదయాత్ర ప్రారంభించి 514 కిలో మీటర్లు కొనసాగించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర నిర్వహించానన్నారు. యాత్ర వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నానన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో మరింత అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. ఈ విషయం జగన్‌తో చర్చిస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాలతో పాటు పేదల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రజలు ఫ్లోరైడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆనం అవినీతికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ మహిళా కన్వీనర్ బండ్లమూడి అనిత, స్పందన ప్రసాద్, పాండురంగారెడ్డి, వహీద్ బాషా, సన్నపరెడ్డి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.