ఎన్ని‘కల’ తీరేవేళ... అంతర్మథనం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం:రాష్ట్ర విభజన నేపథ్యంలో నెలకొన్న పరిణామాలు ఆయన్ను పునరాలోచనలో పడేశాయా? పట్టుకోల్పోయి, దిగజారుతున్న పార్టీ పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నారా? కేడర్‌లో ఆసక్తి కనిపించడం లేద న్న నిర్ణయానికొచ్చారా? బొత్స ప్రాబ ల్యం కోల్పోతున్న వేళ ఎన్నికల్లో గట్టెక్కలేమని అభిప్రాయపడుతున్నారా? ఎందుకొచ్చిన టెన్షన్ అని అంతర్మథనంలో పడ్డారా? విజయనగరం అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని ఆరాట పడుతూ, లైన్ క్లియర్ చేసుకున్న యడ్ల రమణమూర్తిపై ప్రస్తుతం జరుగుతున్న చర్చిది. టిక్కెట్ దాదాపు ఖరారైనా ఆయన ప్రజల మధ్యకు వెళ్లడం లేదు. దీంతో అంతటా ఇదే చర్చ సాగుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ క్రియాశీలక నేతగా వ్యవహరించారు. కానీ, విజయనగరంలో టీడీపీ పెద్ద దిక్కుగా అశోక్ గజపతిరాజు ఉండడం, ఎమ్మెల్యేగా ఆయనను తప్ప మరొకర్ని ఆలోచించే పరి స్థితి లేకపోవడంతో యడ్ల రమణమూర్తి ఎదగలేకపోయారు.
గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాలకైనా వలసపోయి పోటీ చేద్దామని భావించినా అధిష్టానం అవకాశం కల్పించలేదు. ఇక, జిల్లా పరిషత్, ఎమ్మెల్సీ, నామినేటేడ్ పోస్టుల పందేరం జరిగినా సమీకరణాల ప్రభావంతో ఛాన్స్ రాకుండా పోయింది. చెప్పాలంటే కరివేపాకు మాదిరిగా ఆ పార్టీలో మిగిలిపోయారు. తన పాటి సీనియారిటీ ఉన్న నేతలంతా ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నా తానేమీ కాలేకపోయానన్న బాధ పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఎప్పటికైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనేది చిరకాల కోరిక. టీడీపీలో ఉంటే సాధ్యం కాదని, బంధుమిత్రులున్న పార్టీలోకి వెళ్లితే అవకాశం వస్తుందని, బొత్స సత్యనారాయణతో ఉన్న సాన్నిహిత్యంతో కోలగట్ల వీరభద్రస్వామి పక్కన పెట్టి టిక్కెట్ దక్కించుకోగలనని భావించి కాంగ్రెస్‌లో చేరారు. అనుకున్నట్టే అడ్డంకులు తొలగించుకున్నారు.
కోలగట్ల వీరభద్రస్వామికి ఎమ్మెల్సీ కట్టబెట్టడం ద్వారా లైన్ క్లియర్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా టిక్కెట్ల ఎంపిక కోసం వచ్చిన ఏఐసీసీ పరిశీలకుల వద్ద తన పేరునే ప్రతిపాదించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ,కాంగ్రెస్ ప్రజా కంఠక పాలన, అండగా ఉండే బొత్స సత్యనారాయణ అనేక ఆరోపణలతో ప్రాబల్యం కోల్పోవడం, రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో యడ్ల రమణమూర్తి అయోమయంలో పడిపోయారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో నాయకులంతా ప్రచారంలో దూసుకుపోతున్నా యడ్ల మాత్రం కదల్లేకపోతున్నారు. టిక్కెట్ వస్తుందో రాదో తెలియని నేతలు కూడా ఎన్నికల జోష్‌తో పనిచేస్తుండగా తనకే టిక్కెట్ గ్యారంటీ అని తెలిసినా ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారు. దీనికంతటికీ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి, అసహన పరిస్థితులే కారణమని తెలుస్తోంది.
కోలగట్లపై ఒత్తిడి
ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకున్న యడ్ల క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతో ఉన్నకాడికి పార్టీ శ్రేణులు డైలామాలో పడ్డాయి. పోటీ చేస్తే ఫలితమెలా వస్తుందో యడ్ల ముందే ఊహించి ఉంటారని, ఈ వయస్సులో అంత టెన్షన్ అవసరమా అని ఆలోచనకొచ్చేశారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పరిస్థితిని గమనించే మళ్లీ కోలగట్ల వీరభద్రస్వామినే పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సరికాదని, మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా లేనన్న సంకేతాలను కోలగట్ల ఇస్తున్నారు. దీంతో ఇతర పార్టీల్లోకి వలసపోగా మిగిలి ఉన్న నేతలంతా అయోమయంలో పడ్డారు.