
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ అనంత, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చిత్రంలో పెన్నోబిలేసు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, కృష్ణవేణి
అనంతపురం: ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలే స్వచ్ఛందంగా బంద్‌ను జయప్రదం చేసి హోదా ఆకాంక్షను చాటి చెప్పారని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు బంద్ పాటించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన నిరంకుశ వైఖరికి నిరసనగా తాము బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందనీ, దీన్నిబట్టి చూస్తే టీడీపీ నైజం ఏమిటో తెలుస్తోందన్నారు.
ప్రత్యేకహోదా అవసరం లేదని, ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారన్నారు. కానీ మూడు నెలలుగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నానంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. కానీ నేడు తాము కేంద్రం తీరుకు నిరసనగా బంద్ పాటిస్తే ఎందుకు అడ్డుపడ్డారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మదీక్షల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేసి చంద్రబాబు దొంగదీక్షలు చేశారని, తాము నిజాయతీగా పోరాటాలు చేస్తే అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తాను బీజేపీతో పోరాటం చేస్తున్నానంటూ చంద్రబాబు చెబుతుండగా...కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో టీడీపీ తమకు మంచి మిత్రపక్షమని చెబుతున్నారన్నారు. ఈరోజు బంద్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు నిజమని రుజువు చేసిందన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ప్రత్యేకహోదా సాధన ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. బంద్ సందర్భంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడక్కడే అరెస్ట్‌లు చేయడం, వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన ఖండించారు.
ఉరవకొండ ఎమ్మెల్యే యల్లారెడ్డి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, 30 యాక్ట్, 144 సెక్షన్ పేరుతో హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారన్నారు. హోదా కోసం తానే పోరాడుతున్నానంటూ చెబుతున్న చంద్రబాబు... మరోవైపు హోదా ఉద్యమం పట్ల విషం చిమ్ముతూ ఉక్కుపాదం మోపుతూ నిర్వీర్యం చేయాలని చూశారన్నారు. అర్ధరాత్రి నుంచే అరెస్ట్‌లు చేసినా.. అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు పూర్తి మద్దతునిచ్చారన్నారు. హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ప్రజలు తెలియజేశారన్నారు. ఇది చంద్రబాబుకు చెంపపెట్టులాంటదన్నారు. హోదాకోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నామంటూనే... రాష్ట్రంలో జరుగుతున్న హోదా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తన పరిపాలన పట్ల 85 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు... నాలుగేళ్లలో ఎన్నిరోజులు 30 యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంచారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నిరంకుశ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల పట్ల దాడి చేస్తోందన్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వ వైఫల్యాలపట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. బంద్ సందర్భంగా మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, కార్యకర్తల పట్ల జులుం ప్రదర్శించారన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రోడ్లపై అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్‌లు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ అంటే ప్రభుత్వం ఎంత భయపడుతోందో అరెస్ట్‌ల ద్వారా అర్థమైందన్నారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధులు ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, ప్రధానకార్యదర్శి రామచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, కార్పొరేటర్ గంగన హిమబిందు పాల్గొన్నారు.