పీలేరు (చిత్తూరు జిల్లా) :శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ప్రధాన కారకుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన చిత్తూరు జిల్లా పీలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌కు బాధ్యత వహించి సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ నిష్పక్షపాతంగా విచారణ జరిపి చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు సీఎం మోదీ నాయకత్వానికి బంట్రోతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు.. మంత్రులుగా, భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే దమ్ము ధైర్యం సీఎంకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. అదిగో ఇదిగో రాజధాని నిర్మాణం అంటూ రైతుల వద్ద బలవంతంగా లాక్కున్న భూములతో సీఎం, ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన మొదటి ఐదు సంతకాలకు దిక్కులేకుండా పోయిందని దుయ్యబట్టారు.