ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
అనంతపురం : రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం 2018కి పెద్ద జోక్‌గా ఉందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.16 వేల కోట్ల పోలవరం ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 58,650 కోట్లకు పెంచారని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు.. దీంతో ఆ తర్వాత నిధులు ఇచ్చేందుకు కేంద్రం ససేమిరా అంటోందన్నారు. సీఎం నాటకాలను కేంద్రం గుర్తించే నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు కేంద్రం సహకరిస్తే పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 నాటికి పూర్తి చేస్తానని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు నీళ్లిస్తామంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పుణ్యమా అని అభివృద్ధిలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు నెట్టారని వాపోయారు. చంద్రబాబు చేçస్తున్న అవినీతి, అక్రమాలకు వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని తప్ప.. అభివృద్ధికి అడ్డుకాదని స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌లో రూ. 375 కోట్లు అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే పురుషోత్తం పట్నం ప్రాజెక్ట్‌లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ టీడీపీకీ వరంలా మారిందని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రత్యేకహోదా కోసం ఉద్యమాలు చేయడం వేస్ట్ అని ఎన్జీఓ సంఘం అశోక్‌బాబు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాలూ రోడ్డెక్కి పోరాటాలు చేస్తుంటే అశోక్‌బాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment