* దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా పిలుపు
* తుపాను బాధితుల కోసం విరాళాల సేకరణ.. సహృదయంతో స్పందించాలని వినతి
* విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు
* రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్
సాక్షి, హైదరాబాద్: కనీవినీ ఎరుగని రీతిలో హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సానికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తుపాను రూపంలో ప్రకృతి చూపిన ఆగ్రహానికి గంటల్లో అల్లకల్లోలం జరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు చిద్రమయ్యాయి. సర్వహంగులతో శరవేగంగా ఎదుగుతున్న విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. అన్ని వ్యవస్థలు అవస్థలపాలయ్యాయి. 35 మంది నిండు ప్రాణాలతో పాటు వృత్తులు, వ్యాపారాలు, ఇళ్లు, రోడ్లు, చెట్లు, పంటలు.. ఇలా సర్వం కకావికలమైన దృశ్యం కంటతడి పెట్టిస్తోంది.
సాటి మనిషి ఆక్రందన చూసి ప్రతి తెలుగు హృదయం ద్రవిస్తోంది. ఈ విలయం చూసి ‘అయ్యో పాపం’ అనని వారు లేరు. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి సాంత్వన చేకూర్చాలి. ఆపన్న హస్తంతో ఆదుకోవాలి. సహృదయంతో స్పందించాలి. అలా స్పందించే గుణం ప్రతి తెలుగువాడి సొంతం. గతంలోనూ ఇటువంటి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు, బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి ‘వైఎస్సార్ ఫౌండేషన్’ తన సామాజిక బాధ్యతను నిర్వర్తించింది. బాధితులకు అవసరమైన సేవలందించింది.
ఎప్పటిలాగే వైఎస్సార్ ఫౌండేషన్ ఈ విపత్తులోనూ బాధితుల సహాయం కోసం చొరవతో ముందుకు వచ్చింది. కష్టాల్లో ఉన్న పౌరుల్ని ఆదుకునే కృషిలో ఎప్పుడూ ముందుండే ‘సాక్షి మీడియా గ్రూప్’తో కలసి ఈ సేవా కార్యక్రమానికి పూనుకుంది. లోగడ కూడా ఇటువంటి ప్రాకృతిక విపత్తులు చోటుచేసుకున్నప్పుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. ఇప్పుడు హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకు వచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి.
ఈ పిలుపునకు స్పందనగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారిని ఆదుకోవాల్సిందిగా వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు ఈ బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్‌ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ అందించవచ్చు.
జగన్ తొలి విరాళం రూ.50 లక్షలు
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులకు సహాయం అందించేందుకు వైఎస్సార్ ఫౌండేషన్, ‘సాక్షి’ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తొలి విరాళాన్ని ప్రకటించారు. తన వంతుగా ఆయన రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించినట్టు పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించిన నేపథ్యంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి ఏర్పాటు చేసిన తుపాను సహాయ నిధికి తమ వంతుగా శక్తి మేరకు సాయం అందించాల్సిందిగా పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.
బాధితులను ఆదుకోండి
Published Thu, Oct 16 2014 2:23 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement