
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గణనీయమైన విస్తీర్ణంలో సాగు చేసే రెండు ప్రధాన పంటలు.. అరటి, బత్తాయి (స్వీట్ ఆరెంజెస్)లకు సేకరణ ధరను ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రకటించిన పసుపు సేకరణ ధరను కూడా పెంచింది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) ప్రకటించే పంటల్లో అరటి, బత్తాయి లేవు. రాష్ట్రంలో ప్రస్తుతం 88,029 హెక్టార్లలో బత్తాయి, 69,894 హెక్టార్లలో అరటి (టిష్యూ కల్చర్) రకం, 43,101 హెక్టార్లలో అరటి (స్థానిక) రకం సాగవుతోంది.
కొంత కాలంగా ధరల విషయంలో రైతులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రెండు పంటలకు సేకరణ ధరలు ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు గత కొన్నేళ్ల మార్కెట్ రేటును ప్రాతిపదికగా తీసుకుని సగటు ఆధారంగా అరటికి క్వింటాల్‌కు రూ.800, బత్తాయి క్వింటాల్‌కు రూ.1,400గా సేకరణ ధరలను నిర్ణయించారు. పసుపు ధరను క్వింటాల్‌కు రూ.6,850గా ప్రకటించారు. ఇందుకు స్థిరీకరణ నిధిని ఉపయోగించుకుంటుంది.