ప్రతి రైతుకూ ‘మద్దతు’ | CM Jagan says that RBKs authorities have key role support price for farmers | Sakshi
Sakshi News home page

ప్రతి రైతుకూ ‘మద్దతు’

Published Tue, Dec 21 2021 3:12 AM | Last Updated on Tue, Dec 21 2021 7:47 AM

CM Jagan says that RBKs authorities have key role support price for farmers - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ప్రతి రైతన్నకూ కచ్చితంగా ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) దక్కేలా చూడటం, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, అధికారులు కృషి చేయాలని సూచించారు. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు.

ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతులకు చెల్లింపులు జరగాలని నిర్దేశించారు. రైతన్నలపై రవాణా వ్యయం, గోనె సంచుల కొనుగోలు, హమాలీ ఖర్చుల భారం పడకూడదని ఆదేశించారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి సమస్యలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఫోన్‌ నంబర్‌ ఉండాలని, పంటల కొనుగోలు బాధ్యతను ఆర్బీకేల్లో ఐదుగురు సిబ్బందికి అప్పగించాలని సూచించారు. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.   
ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. 
రైతులకు సేవలందించడంలో అలసత్వం వహించరాదు. సమాచార లోపం ఉండకూడదు. తరచూ రైతులతో మాట్లాడాలి. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గతంలో ఎవరూ ముందుకొచ్చిన దాఖలాలు లేవు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతన్నలకు గరిష్టంగా వీలైనంత మేర ప్రయోజనం కల్పిస్తున్నాం. వారికి భరోసా కల్పిస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి. ధాన్యం నాణ్యత పరిశీలనలో రైతులు మోసాలకు గురి కారాదు. విదేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చర్యలు చేపట్టాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. 

ఆర్బీకేలో ఐదుగురు సిబ్బందిదే బాధ్యత.. 
ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌తోపాటు ఇతర సిబ్బంది ముగ్గురు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఆర్బీకేలో కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి. రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడి కొనుగోలుకు సంబంధించి అవసరమైన బాధ్యతలన్నీ వారే నిర్వర్తించాలి. గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను ఈ ఐదుగురు సిబ్బందే ఏర్పాటు చేయాలి. వాటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదు. ఆ భారం రైతులపై పడకుండా చర్యలు తీసుకోవాలి.  
కృష్ణా జిల్లా గొల్లపూడిలోని రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తున్న మహిళ 

నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయి పర్యటనలు.. 
ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా చెల్లింపులు జరిపి రైతులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలి. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అనే అంశంపై  దృష్టి పెట్టండి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారో లేదో పరిశీలించండి. కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును నిశితంగా గమనించండి. వీటన్నిటిపై వచ్చే మూడు నాలుగు రోజులు దృష్టి పెట్టండి. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి మీ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలి. 

సీసీఆర్సీ కార్డ్స్‌పై మరింత అవగాహన 
కౌలు రైతులకు సీసీఆర్సీ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్‌) కార్డుల జారీపై అవగాహన కల్పించాలి. సీసీఆర్సీ కార్డుల వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న విషయాన్ని చెప్పాలి.  

ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక బోనస్‌ 
రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన పెంపొందించండి. అలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్‌ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై కార్యాచరణ సిద్ధం చేయండి. వాటి కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని తెలియచేయాలి. రైతులకు మంచి ఆదాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. 

సగటున 42,237 టన్నుల కొనుగోలు 
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రోజుకు సగటున 42,237 మెట్రిక్‌ టన్నులకు చేరినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. సమీక్షలో మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, సీఎస్‌ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధనరెడ్డి, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, అగ్రికల్చర్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, సివిల్‌ సఫ్లైస్‌ డైరెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, సివిల్‌ సఫ్లైస్‌ ఎండీ జి.వీరపాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఫిర్యాదుల కోసం ఫోన్‌ నంబర్‌ 
పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో నంబర్‌ ఏర్పాటు చేయాలి. ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలి. క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలి. దీనివల్ల సమస్య తీవ్రత తెలియడంతోపాటు పరిష్కార మార్గాలు లభిస్తాయి. రైతులతో అధికారులు నిరంతరం సంప్రదించాలి. జేసీల నుంచి కూడా పంటల కొనుగోలుపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement