సీపీఎస్‌ రద్దుకు సై.. | YS Jagan Guaranteed About CPS Cancellation | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దుకు సై..

Published Thu, Mar 14 2019 11:11 AM | Last Updated on Thu, Mar 14 2019 11:12 AM

YS Jagan Guaranteed About CPS Cancellation - Sakshi

సాక్షి, కడప : భాగస్వామ్య పింఛన్‌ విధానం (సీపీఎస్‌)ను రద్దు చేస్తామని ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీపై ఉద్యోగుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. తాము అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి.. పాత పింఛన్‌ విధానం అమలు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు ఇప్పటికే పలుమార్లు చేసిన ఉద్యమాలను ప్రభుత్వం అణగతొక్కింది.

రాష్ట్రంలో 2017, 2018 సెప్టెంబరులో చేపట్టిన మిలియన్‌ మార్చ్, చలో విజయవాడ కార్యక్రమాలను అణచివేసింది. పలు జిల్లాలు, ప్రాంతాల్లో ఉపాధ్యాయ సంఘ నేతలు, సీపీఎస్‌ ఉద్యోగులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించిన ఘనతను మూట కట్టుకుంది. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ.. ఏటా సెప్టెంబరు ఒకటిన సీపీఎస్‌  పరిధిలోని ఉద్యోగులు సామూహిక సెలవుదినాన్ని పాటిస్తున్నారు.

ఎన్ని ఆందోళనలు చేపట్టినా, విన్నపాలు ఇచ్చినా ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి, విదేశ పర్యటనలకు ప్రత్యేక విమానాలు, ప్రచార ఆర్భాటాలకు రూ.కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. ఉద్యోగుల విషయానికొస్తే రాష్ట్రం లోటులో ఉందనే సాకులు చెబుతోందని వారు వాపోతున్నారు.

 
మొదటి నుంచి ఆందోళనే..
సీపీఎస్‌ విధానంలో ఉద్యోగి మూలవేతనం, దినసరి భత్యం నుంచి పది శాతం నిధులను ప్రభుత్వం మినహాయించుకుని, అంతే మొత్తాన్ని జత చేసి దాన్ని షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతోంది. ఇందులో లాభనష్టాలను మాత్రం ఉద్యోగి భరించాలి. షేర్‌ మార్కెట్‌ అనేది జూదం లాంటిదని ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే తమ సీపీఎస్‌ ఖాతాలో ఎంత మొత్తం ఉందనే విషయం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు.

ఉద్యోగి చనిపోయినా, అలాగే ఉద్యోగం మానివేసినా.. ఆ నగదు ఎలా పొందాలనే దానిపై ప్రభుత్వాలు విధివిధానాలు ట్రెజరీలకు అందించలేదు. దీంతో ఆ నగదును ఉపసంహరించుకునే పరిస్థితి లేక కొందరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము 60 ఏళ్ల వరకు సేవ చేసిన తరువాత ప్రభుత్వం పింఛన్‌ అందిస్తే.. ఉద్యోగ విరమణ జీవితాన్ని ప్రశాంతంగా ఆర్థిక భరోసాతో గడిపే అవకాశముంటుందని వారు పేర్కొంటున్నారు. 


జగన్‌ హామీతో వేలాది కుటుంబాలలో ఆనందం
2004 సెప్టెంబరు నుంచి పాత పింఛన్‌ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 1.64 లక్షల మంది, జిల్లాలో దాదాపు 15 వేల మంది సీపీఎస్‌ పరిధిలో ఉన్నారు. 2004 నోటిఫికేషన్‌ తరువాత జిల్లాలో 12 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉన్నత విద్యామండలి, ఆరోగ్య, పోలీసు తదితర శాఖలలో మరో మూడు వేల మంది ఉద్యోగులు సీపీఎస్‌ పరిధిలో ఉన్నారు.


పాతవిధానం, సీపీఎస్‌ పోలికలివే..

  • పాత విధానంలో ఉద్యోగి పింఛను కోసం ఒక రూపాయి కూడా జీతం నుంచి చెల్లించక్కరలేదు. సీపీఎస్‌లో ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా పది శాతం దాచుకోవాల్సి ఉంది. 
  • పాత విధానంలో ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆ ఇంట్లో అర్హత గల వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇచ్చేవారు. మరణించిన ఉద్యోగి భార్యకు పింఛను ఇచ్చేవారు. సీపీఎస్‌ విధానంలో.. ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకాలు ఉండవు.
  • ఉద్యోగి తన భవిష్యనిధిలో దాచుకున్న డబ్బుకు ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సీపీఎస్‌లో దాచుకున్న డబ్బుకు ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది.
  • ఉద్యోగ విరమణ పొందిన తర్వాత షేర్‌మార్కెట్‌లో ఈ పెట్టుబడుల వల్ల హెచ్చుతగ్గులు వచ్చి స్థిరీకరణతో కూడిన పింఛను అందదు. 
  • కరువు భత్యం వర్తించదు.
  • ఉద్యోగి ఆరోగ్య కార్డు రద్దవుతుంది.

సీపీఎస్‌ మా పాలిట శాపం
ఉద్యోగ భద్రత లేని సీపీఎస్‌ ఉద్యోగుల పాలిట శాపం. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చేప్పేందుకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలం సిద్ధంగా ఉన్నాం.
 – పుల్లయ్య, సీపీఎస్‌ కమిటీ నాయకుడు, ఎస్టీయూ 

మా ఆశలు నెరవేరుతాయి
పాత పింఛను విధానాన్ని ప్రవేశ పెడతామని వైఎస్‌ జగన్‌ చెప్పిన ఒక్క మాటతో లక్షలాది కుటుంబాల ఎదురుచూపులు తీరతాయి. ఎన్నో ఏళ్లుగా సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానం ప్రవేశ పెట్టాలని నాయకులను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నా పట్టించుకోలేదు. 
– విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు

రద్దు చేసే వారికే మా మద్దతు
జగన్‌ సీపీఎస్‌ రద్దు హామీ ఇవ్వడం గొప్ప విషయం. ఆయన ఉద్యోగుల కష్టాలు చూసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. సీపీఎస్‌ రద్దుకు సహకరించే వారికే మా మద్దతు తెలుపుతాం. జగన్‌ తీసుకున్న సీపీఎస్‌ రద్దు నిర్ణయం చారిత్రాత్మకంగా మారడం ఖాయం. 
– రాజగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement