
ముమ్మిడివరం నుంచి సాక్షి ప్రతినిధి: ఐదారు నెలలుగా ఎన్నో మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేక తనపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, నిందలు వేసినా ప్రజల కోసం తట్టుకుని నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు. మంచి పనులను తప్పులుగా చూపుతున్న వారిని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొమానపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున రాష్ట్రంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల మధ్య ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. అందుకే ప్రభుత్వం ఏర్పడి ఐదారు నెలలు తిరక్కముందే నాడు ఇచ్చిన హామీని ఇదే వేదికపై నుంచి నెరవేరుస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏం మాట్లాడారంటే..
నేనున్నానని ఆరోజే చెప్పాను..
‘కాలినడకన 2018లో ఇదే ముమ్మిడివరం రోడ్డు మీదుగా వెళ్లేటప్పుడు మీరంతా ఎంతో అవేదనతో చెప్పిన మాటలు విన్నాను. మీ బాధలను కళ్లారా చూశాను. తమకు రావాల్సిన పరిహారం కోసం దాదాపు 16 వేల మంది మత్స్యకారులు ఐదారేళ్లుగా యుద్ధం చేస్తుంటే పట్టించుకోనిది ఒక ప్రభుత్వమా అనిపించింది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా కూడా బతుకుదెరువు కోసం ఎక్కడో గుజరాత్‌కో, మరో రాష్ట్రానికో వలస పోతున్న పరిస్థితులు నా కళ్లారా చూశాను. మీ అన్నగా, తమ్ముడిగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం ఏర్పడి ఐదారు నెలలు కాక ముందే గంగపుత్రుల జీవితాలను మార్చటానికి తీసుకున్న నిర్ణయాలు ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు. ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్
సీఎం స్థానంలో ఉన్నది మీ కష్టాలు తీర్చడానికే..
ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వం మత్స్యకారులకు రూ.4 వేలు ముష్టి వేసినట్లు ఇచ్చేది. అది కూడా కొందరికే. మనం అధికారంలోకి వచ్చే సరికి జూన్ వచ్చింది కాబట్టి అది కూడా ఎగరగొట్టేసినా ఎవరూ అడగరని కొందరు సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది ప్రజల బాధల్లో భాగస్వాములై మంచి చేయడానికే తప్ప, ఎలా ఎగ్గొట్టాలని ఆలోచించడానికి కాదని చెప్పాను. ఆ రోజు ఇచ్చిన మాట మేరకు నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున.. వేట విరామ పరిహారాన్ని రూ.4 వేల నుంచి అక్షరాలా రూ.10 వేలకు పెంచుతున్నా. కాసేపట్లో కంప్యూటర్లో బటన్ నొక్కిన వెంటనే అక్షరాలా లక్ష పైచిలుకు ఉన్న మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పడుతుంది. మీ ఫోన్ నంబర్లకు మెసేజ్ కూడా వస్తుంది.
కచ్చులూరులో మునిగిన బోటును తీసిన ధర్మాడి సత్యంను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి
బడుల్లో సమూల మార్పులు
బడులన్నింటినీ ‘నాడు–నేడు’ అని చూపిస్తూ సమూలంగా మార్చి అన్ని మౌలిక వసతులు కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి బడిలోను ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం. మన పిల్లలు గొప్పగా చదవాలి. ప్రపంచంతో పోటీపడే పరిస్థితి రావాలి. కేవలం డ్రైవర్ల వంటి ఉద్యోగాలకు పరిమితం కాకూడదు. టై కట్టుకుని ఫారిన్ వెళ్లే పరిస్థితి రావాలి. డాక్టర్లుగానో, ఇంజినీర్లుగానో, కలెక్టర్లుగానో స్థిరపడే పరిస్థితి రావాలి. ఇదే ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ఆసుపత్రుల పరిస్థితులు కూడా మార్చబోతున్నాం.
గొప్ప మార్పు తీసుకురాబోతున్నాం’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ముత్తంశెట్టి శ్రీనివాస్, సీఎం కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మత్స్యకారుల కోసం..
►లీటరు డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీని ఈ రోజు నుంచి రూ.6 నుంచి రూ.9కి పెంచుతున్నాం. ఇదివరకటి పరిస్థితులను మారుస్తూ 81 బంకులను గుర్తించి వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి గుర్తింపు కార్డులు ఇస్తాం. బంకులో డీజిల్ పట్టేటప్పుడే సబ్సిడీ మినహాయించి కట్టే పరిస్థితిని తీసుకువస్తున్నాం.
►వేటకు వెళ్లే మత్స్యకారులు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి అతను కుటుంబానికి దూరమైతే ఆ కుటుంబానికి భరోసాగా రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నా.
►గుజరాత్ స్టేట్ ప్రెట్రోలియం కార్పొరేషన్ డ్రిల్లింగ్ వల్ల ముమ్మిడివరంలో 2012లో 8 మండలాల్లోని 68 గ్రామాల్లో 5,060 పడవలపై చేపల వేటకు వెళ్లలేకపోయిన 16,594 మత్స్యకార కుటుంబాలు జీవనభృతి కోల్పోయాయి. అందుకుగాను ఆ కార్పొరేషన్ వారు ఇవ్వాల్సిన సొమ్ము 13 నెలలకు గాను 6 నెలలు మాత్రమే ఇచ్చి రూ.74 కోట్లు ఎగ్గొట్టిన పరిస్థితి. ఈ డబ్బు కోసం ఇవాళ ఓఎన్‌జీసీతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అ డబ్బులు ఎప్పుడు వస్తాయో.. అసలు వస్తాయో రావో తెలియదు. అందుకే మత్స్యకార కుటుంబాలు అవస్థలు పడకూదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.78.24 కోట్లు 16,594 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. తర్వాత ఆ డబ్బు కేంద్రం నుంచి ఎలా తెచ్చుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుటుంది.
►ఉప్పాడ, మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేట, రాళ్లపేట, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరువలోని బియ్యపుతిప్ప, విజయనగరం జిల్లా చింతపల్లి, నిజాంపట్నం, ఇలా అవసరమైన చోటల్లా రాబోయే కాలంలో జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. మత్స్యకారులకు మంచి చేయడానికి 794 గ్రామ సెక్రటేరియట్‌లలో మత్స్యకార సహాయకులను నియమిస్తున్నాం.
పైపులైనుల వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం చెక్కు ఇస్తున్న సీఎం
అందరి కోసం ఇలా..
►ఐదారు నెలలుగా మన ప్రభుత్వం పని చేస్తున్న తీరు మీరు గమనిస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎపుడూ చేయని విధంగా ఈ ఆరు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ ఉద్యోగులందరూ గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్నది కూడా మీకు కనిపిస్తుంది.
►46 లక్షల పైచిలుకు రైతులకు పెట్టుబడి భరోసా కింద రూ.13,500 ఇవ్వగలిగే పరిస్థితిని దేవుడు కల్పించాడు.
►ఆటోలు, టాక్సీలు తోలుకుంటున్న సోదరులకు సహాయం చేయగలిగాం.
►అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటున్నాం.
►దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాలు మార్చేందుకు నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చాం.
►సామాజికంగా ఇబ్బందులు పడుతున్న అక్క చెల్లెమ్మలకు అండగా ఉండేందుకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50æ శాతం ఇచ్చిన ప్రభుత్వం మనదేనని సగర్వంగా చెబుతున్నా.
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. లక్ష చెక్కును అందిస్తున్న గోదావరి మహిళా సమాఖ్య
వైఎస్సార్ వారధి ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తొలుత వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ వారధిని ప్రారంభించారు. వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.1.62 కోట్లతో నిర్మించే టూరిజం బోటు కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించి, పలు సూచనలు చేశారు. అనంతరం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం వెళ్లారు. మంత్రి మల్లాడి కృష్ణారావు ఇంటికి వెళ్లి.. ఇటీవల మృతి చెందిన అతని తండ్రి సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణారావుతో మాట్లాడారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం పశువుల్లంకలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి వారధిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►తప్పుగా మాట్లాడుతున్న నాయకులు, పత్రికాధిపతులు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ‘అయ్యా.. మీ పిల్లలు, మీ మనవళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు?’ అని గట్టిగా అడగండి. మీ పిల్లలకేమో ఇంగ్లిష్ మీడియం.. మా పిల్లలకు తెలుగు మీడియమా? అని నిలదీయండి.
►మీ కోసం చేయగలిగిందంతా చేస్తున్నా. ఎంత మంది శత్రువులు ఏకమై నాపై కుట్ర పన్నినా, అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతా. దేవుడి చల్లటి చూపు, మీ దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా పని చేస్తా.
►బ్యాక్ వర్డ్ క్లాస్ అంటే వెనుకబడినది కాదని, బ్యాక్ బోన్ క్లాస్‌గా మార్చాలని నేను తపించాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ముందుకు తీసుకుపోవాలని ఆరాట పడటమే నేను చేసిన తప్పా?
►ఈ ఐదారు నెలల కాలంలో ఎన్నెన్నో గొప్ప పనులు చేస్తుండటాన్ని చూస్తూ కూడా కొందరు ఎలా అపనిందలు వేస్తున్నారో మీరూ చూస్తున్నారు. ఏ చెడ్డ పని చేయకపోయినా ప్రజలను మభ్య పెట్టేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు.
– సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment