చెప్పిందేమిటి.. చేస్తున్నదేమిటి? | YS Jagan Mohan Reddy fires on chandrababu at Nandyal-election campaign | Sakshi
Sakshi News home page

చెప్పిందేమిటి.. చేస్తున్నదేమిటి?

Published Mon, Aug 21 2017 3:02 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

YS Jagan Mohan Reddy fires on chandrababu at Nandyal-election campaign

- చంద్రబాబు వైఖరిపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు  
మోసకారి బాబుకు గుణపాఠం చెప్పి.. విశ్వసనీయతకు పట్టం కట్టండి 

 
నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అధికారంలోకి రావడానికి చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలిచ్చాడు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. అలా ఇవ్వలేకపోతే రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు.. వందలాది హామీలు గుప్పించాడు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ అన్ని వర్గాల వారి ఓట్లు వేయించుకని తీరా ముఖ్యమంత్రి అయ్యాక అందరినీ మోసం చేశాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దారుణంగా అందరినీ వంచించాడు. ముఖ్యమంత్రి హోదాలో కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జిల్లాకు పలు హామీలిచ్చారు.

వాటిలో కూడా ఒక్కటీ నెరవేర్చలేదు. ఇపుడు నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చిందని మళ్లీ పాత టేప్‌ రికార్డర్‌లా అవే అబద్ధాలు.. అవే మోసాలు వల్లె వేస్తున్నారు. చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి?’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా 12వ రోజు ఆదివారం వైఎస్‌ జగన్‌ రోడ్‌షో.. సంఘమిత్ర నుంచి ప్రారంభమై ప్రియాంకనగర్, డేనియల్‌పురం చర్చి, సంజీవనగర్‌ గేట్, రాణి మహారాణి, నందమూరినగర్‌ మీదుగా వైఎస్‌ నగర్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా నందమూరినగర్, వైఎస్‌ నగర్‌లో జగన్‌ మాట్లాడారు. మోసం చేయడం కోసం చంద్రబాబు ఏ గడ్డి తినడానికైనా వెనుకాడరని మండిపడ్డారు. మోసకారి చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలంటే ప్రజలు విశ్వనీయతకు పట్టం కట్టి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..  
 
వైఎస్‌ హయాంలోనే పేదలకు భరోసా.. 
పేదలెవరూ విద్య, వైద్యం విషయంలో అప్పులపాలు కాకూడదని తపించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారు. పేదవాళ్లు ఇంజినీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి గొప్ప చదువులు చదువుతానంటే నేను తోడుగా ఉంటానంటూ వైఎస్సార్‌ ఆ విద్యార్థులకయ్యే ఫీజు మొత్తాన్ని ఆ పథకాల ద్వారా చెల్లించారు. పేదవాడికి తోడుగా నిలవడంతో ఎందరో పేదవాళ్లు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. ఇప్పుడు బాబు హయాంలో ఇంజినీరింగ్‌ చదివేందుకు ఏటా రూ.లక్షదాకా ఖర్చవుతుంటే.. బాబు మాత్రం ముష్టి వేసినట్లు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు.

అది చెల్లించడానికి ఏడాదికిపైగా సమయం తీసుకుంటున్నారు. పైగా మిగిలిన సొమ్ము కట్టకపోతే చదివే పరిస్థితి లేదు. అందుకోసం ఇల్లు, పొలం అమ్ముకుంటారులే అని హేళనగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యం బాగోలేక ఏ పేదవాడైనా మంచం పట్టి.. 108కు ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో వచ్చి కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. చిరునవ్వుతో ఇంటికి పంపించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఇవాళ ఆరోగ్యశ్రీ నిర్వీర్యమవుతోంది. 8 నెలలుగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు డాక్టర్లు ఆపరేషన్లు చేయడానికి వెనకాడుతున్నారు. కాక్లియర్‌ ఇంప్లాంట్, కీమోథెరపీ, డయాలసిస్‌ వంటి వాటికి చంద్రబాబు సర్కారు షరతులు పెట్టింది. చంద్రబాబు దారుణ పాలనలో వైద్యం అందక పేదవాళ్లు చనిపోయే దుస్థితి నెలకొంద’’ని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement