సాక్షి, నంద్యాల: అవినీతి అనేది ఆంధ్రప్రదేశ్‌లో లైసెన్స్‌లా మారిందని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చాపిరేవుల గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. తమకు ప్రత్యేక అవసరం ఏమీ లేనప్పటికీ గ్రామ ప్రజలందరూ ఒక నదిలా ప్రసంగ స్ధలం వద్దకు చేరుకుని ఆప్యాయతను చూపిస్తున్నారని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, చెల్లికి, ప్రతి అవ్వకు,తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి అందరికి చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర కేబినేట్ మొత్తం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తోందని, టీడీపీ అధికారంలో ఉన్న ఈ మూడున్నరేళ్లలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఇలా మంత్రులు పర్యటించలేదని అన్నారు.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌లు నంద్యాల వైపు చూస్తున్నారని చెప్పారు. మరి ఎన్నికల ముందు వరకూ నంద్యాల వైపు ఎందుకు చూడలేదని ప్రశ్నించారు. గెలుపే లక్ష్యంగా వందల కోట్ల డబ్బును వెదజల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చిన్నాచితకా నాయకులను కూడా మీ రేటెంతా? అంటూ కొనుగోలు చేయడానికి టీడీపీ బేరసారాలు చేస్తోందని అన్నారు.
'ప్రతి సామాజిక వర్గానికి ఎరలు వేయడం, అది కుదరకపోతే బెదరింపులకు దిగడం టీడీపీ నేతలకు అలవాటైపోయింది. నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీకి ఆర్యవైశ్య సామాజిక వర్గ మద్దతు బాగా ఉంది. దీంతో వాళ్లను తమ వైపుకు తిప్పుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిని తర్వాత ఓ ఆర్యవైశ్య కుటుంబం తలుపుతట్టిన పోలీసులు బెదిరింపులకు దిగారు. ఇంట్లో ఉన్న రూ.3.5 లక్షలు ఎక్కడివని ప్రశ్నించారట. వారికి మెడికల్ షాపు ఉంది. దుకాణం పెట్టుకున్న వారి ఇంట్లో డబ్బు ఉంటే తప్పేంటి. భయభ్రాంతులకు గురిచేసైనా తమ వైపుకు తిప్పుకోవాలని టీడీపీ చూస్తోంది. ఇవాళ చంద్రబాబు పరిస్ధితి చూస్తూ ఉంటే నాకు జాలేస్తోంది. ఇంత దారుణమైన పరిస్ధితి ఎందుకొచ్చిందో ఆయన్ను ఆయనే ప్రశ్నించుకోవాలి.
మూడున్నరేళ్ల కాలంలో ఒక్క హామీ కూడా ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో ఆలోచించుకోవాలి. ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా బాబు న్యాయం చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు దారుణ పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కచోట కూడా అభివృద్ధి కనిపించడం లేదు. అవినీతి అనేది రాష్ట్రంలో లైసెన్స్‌లా మారింది. ఇంతటి అన్యాయమైన, దుర్మార్గమైన పాలన ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. అన్యాయంగా ఎమ్మెల్యేలను లాక్కుంటారు. నిసిగ్గుగా వారిని మంత్రులు చేసుకుంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. నిలదిస్తే.. వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తారు.
ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ అవే ప్రలోభాలు, మోసాలకు పాల్పడుతూ ఉంటారు. డబ్బుతోనూ, మద్యంతోనూ, పోలీసు బలంతోనూ గెలవొచ్చని బాబు అనుకుంటున్నారు. బాబుకు కళ్లు నెత్తి మీదకు వచ్చాయి. ఎవరినైనా నీ రెటెంతా? అని అడుగుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్ధితుల్లో ఇవాళ ఎన్నికలు జరగుతున్నాయి. మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు చేసిన మోసానికి వ్యతిరేకంగా మనం ఓటు వేస్తున్నాం. ఆయన పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం అని ప్రజలు గుర్తుంచుకోవాలి. మనం వేసే ఓటు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి కాదని.. అన్యాయానికి, అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నామని భావించాలి. ఈ ఎన్నికలు ధర్మానికి , అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. చంద్రబాబులా నా దగ్గర డబ్బు లేదు. అధికారం లేదు. పోలీసు బలం లేదు. నిజాన్ని అబద్దంగాను, అబద్దాన్ని నిజంగా చూపించే టీవీ చానెళ్లు, పేపర్లు లేవు. ఆయనలా దుర్భుద్ధి లేదు.
నా దగ్గర ఉంది ఏంటో తెలుసా.. నా ఆస్తి మా నాన్నగారు ఇచ్చి వెళ్లిపోయిన మీరే. మీరే నా ఆస్తి. నాకున్న ఆస్తి.. జగన్ మోసం చేయడు. ఏదైనా చెప్తే చేస్తాడు. జగన్ కూడా వాళ్ల నాన్నలానే పేదల కోసం తపిస్తాడు. పేదల జీవితం మారుస్తాడనే నమ్మకం. నా ఆస్తి విలువతో కూడుకున్న రాజకీయాలు చేయడం.'