విధుల్లో నిత్యం విపరీతమైన ఒత్తిడి.. శారీరకంగానూ.. మానసికంగానూ క్షణం తీరికలేక నిరంతరం పనిభారంతోనే కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి.. కుటుంబంతో సరదాగా గడిపే కనీస హక్కూ లేకుండా ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు అందించటంలోనే నిమగ్నం.. ఇదీ ప్రస్తుత పోలీసుల పరిస్థితి. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో వీరి పాత్ర కీలకం.. వీరు విశ్రాంతి తీసుకుంటే అశాంతి చెలరేగే ప్రమాదం ఉన్నందున వీక్లీ ఆఫ్ వీరికి ఎండమావైంది.
సాక్షి, ఏలూరు టౌన్: ఆకస్మికంగా ఏ సమస్య వస్తుందో.. ఏ సమయంలో ఎక్కడ గొడవలు జరుగుతాయో తెలియదు. వీఐపీలకు ప్రొటోకాల్, శాంతిభద్రతల పరిరిక్షణ పని ఒత్తిడి. ఎక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుందో తెలియదు. ఏ అధికారి చీవాట్లు పెడతారో, ఏ ప్రజాప్రతినిధి మండిపడతారో అని నిత్యం టెన్షన్.. టెన్షన్.. ఈ ఒక్క కారణంతోనే ఇప్పటివరకూ పోలీసులు వీక్లీ ఆఫ్‌కు దూరంగా ఉన్నారు. నిరంతరం రక్షణ బాధ్యతలు మోస్తూ నీరసించిపోతున్నారు. వారానికి ఒక్కరోజు సెలవు కరువై అల్లాడుతున్నారు. అందుకే ఏళ్ల తరబడి వారాంతపు సెలవు కోసం పోలీసులు పోరాడుతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన ప్రభుత్వాలు వీరి గురించి ఆలోచించిన దాఖాలాలు లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు వీక్లి ఆఫ్ ఇచ్చే అంశంపై దృష్టిసారించారు. దీనిపై కమిటీని నియమించారు. ఫలితంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పక్కాగా ప్రణాళికలు
సాధారణంగా ఎన్నికలప్పుడు నాయకులు రావటం ఎన్నో హామీలు గుప్పించటం.. అధికార పీఠంపై కూర్చోగానే అవన్నీ మర్చిపోవడం మామూలే. కానీ తాను ఇచ్చిన హామీలను పక్కాగా నూరు శాతం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామంటూ హమీ ఇచ్చిన ఆయన ప్రభుత్వం ఏర్పాటుకాగానే ఆ హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. 24 గంటలూ పని ఒత్తిడితో కుటుంబాలకు దూరంగా ఉంటూ పోలీసులు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించారు. వీక్లీ ఆఫ్ అమలుకు ఎదురయ్యే సమస్యలు, సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఇటీవల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అడిషనల్ డీజీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకూ అందరికీ స్థానం కల్పించారు.
ఉదాహరణకు పరిస్థితి ఇలా :
⇔ ఏలూరు నగరంలో పరిస్థితి చూస్తే ఏలూరు జనాభా సుమారు 3.20 లక్షలు. మూడు పట్టణ పోలీస్‌స్టేషన్లతోపాటు, సీపీఎస్, మహిళా, రూరల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి.
⇔ 1టౌన్ పోలీస్ స్టేషన్లో 55మంది, 2టౌన్ పోలీస్ స్టేషన్లో 60మంది, 3టౌన్ పోలీస్ స్టేషన్లో 26మంది,
⇔ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 20మంది, మహిళా పోలీస్ స్టేషన్లో 28మంది, రూరల్ పోలీస్ స్టేషన్లో 30మంది,
⇔ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 36మంది, ఎస్సీ, ఎస్టీ విభాగంలో 8మంది, పీసీఆర్ విభాగంలో 15మంది పోలీసులు పనిచేస్తున్నారు. ఈ స్టేషన్లు, విభాగాల పరిధిలో మొత్తం సుమారుగా 278మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు సమాచారం. కానీ వీరిలో 80మందికి పైగా సిబ్బంది పోలీస్ శాఖలోని ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏలూరు నగరంలో కనీసం 350మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా, సిబ్బంది కొరత ఉంది. ఇప్పుడు వీక్లి ఆఫ్‌లు అమలు చేస్తే అదనపు సిబ్బంది అవసరమవుతారు. దీనిపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.
వీక్లీఆఫ్ హర్షణీయం
పోలీసు శాఖలో పోలీసులకు వారాంతపు విరామం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవటం హర్షణీయం. వీక్లీ ఆఫ్ అమలుపై రాష్ట్రస్థాయిలోనూ ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. వీక్లీ ఆఫ్ అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. వీక్లీ ఆఫ్ ఇవ్వడంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా.. వాటిని ఏవిధంగా అధిగమించాలనే అంశాలపై చర్చిస్తున్నారు. కానీ పోలీసులు ఒత్తిడిని జయించాలంటే ఖచ్చితంగా విశ్రాంతి అవసరం.
– ఆర్.నాగేశ్వరరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఆశలు ఫలిస్తున్నాయి
పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లకు కృతజ్ఞతలు. వీక్లీ ఆఫ్ అమలు కార్యరూపానికి వస్తుండడం శుభపరిణామం. ఎన్నో ఏళ్ళుగా నెరవేరని పోలీసుల ఆశ ఫలిస్తుంది. పోలీసులు వారి కుటుంబాలతో ఒకరోజైనా సంతోషంగా గడిపే అవకాశం రావటం సంతోషం. జిల్లాలోనూ త్వరలోనే ఎస్పీ నవదీప్‌సింగ్ పర్యవేక్షణలో పక్కాగా అమలు అవుతుందనే నమ్మకం ఉంది.
– కె.నాగరాజు, పోలీసు అధికారుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు
పక్కాగా అమలు చేస్తాం
పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను పక్కాగా అమలు చేస్తాం. డీజీజీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం మంగళవారం ఉంది. ఈ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తూ ఒకరోజైనా విశ్రాంతి దొరికేలా చర్యలు చేపడతాం.
– నవదీప్‌సింగ్ గ్రేవల్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment