
నటుడు పృథ్వీరాజ్
నెల్లూరు(బృందావనం): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన దేవుడని ఆయన సిద్ధాంతమే తన సిద్ధాంతమని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. తన ఊపిరి ఆగేవరకు జగన్ వెంటనడుస్తానన్నారు. నెల్లూరు పురమందిరంలో ఆదివారం రాత్రి కళాంజలి సాంస్కృతిక సంస్థ, కళాంజలి కామెడీక్లబ్–నెల్లూరు ఆధ్వర్యంలో సినీ ‘హాస్యచక్రవర్తి’ టీవీ రమణారెడ్డి స్మారక అవార్డును ఆయన అందుకున్నారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎందరో కళాకారులకు, నటులకు జన్మనిచ్చిన నెల్లూరులో హాస్యనట చక్రవర్తి టీవీ రమణారెడ్డి అవార్డును అందుకోవడం తన అదృష్టమని చెప్పారు. తాను జగన్‌కు మద్దతుపలికిన సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని, అలాంటి వాటికి తాను భయపడబోనని చెప్పారు. జగన్‌లా తనకు గుండె ధైర్యమెక్కువన్నారు. తాను చెప్పిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌ను సీఎం చంద్రబాబు కాపీకొట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు అవార్డు అందచేసిన కళాంజలి సంస్థ నిర్వాహకుడు అనంత్‌కు పృథ్వీరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. పృథ్వీరాజ్‌కు అవార్డును నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అందజేసి, సన్మానించారు.
పృథ్వీరాజ్‌కు రమణారెడ్డి స్మారక అవార్డును అందచేస్తున్న నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి