
తండ్రికి తనయుడి ఘన నివాళి..
ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.
కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి ఈరోజు ఉదయం ఎర్రగుంట్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడపనున్నారు.
అనంతరం ఇటీవల చక్రాయపేట మండలం దేవరగట్టుపల్లెలో గుండె పోటుతో మృతి చెందిన వైఎస్‌ఆర్ సీపీ మండల యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య సోదరుడు నాగభూషణం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన (గురువారం) ఉదయం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.