వైఎస్ పథకాలు జగన్‌తోనే సాధ్యం
Published Mon, Feb 10 2014 1:23 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
పెదకాకాని, న్యూస్‌లైన్ :రాష్ట్రాభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆలోచనలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమవుతాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. పెదకాకానిలో ప్రారంభమైన గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం ఆదివారం మూడో రోజుకు చేరింది. కార్యక్రమానికి అయోధ్యరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాతూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నిర్వహించి 2004 ఎన్నికలకు ముందు అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపించారని గుర్తుచేశారు.
రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా.. పార్టీ అధిష్టానం మహానేత తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఆయన కుటుంబానికి మన కుటుంబం అండగా వుండాలని తన తల్లిదండ్రులు కోరారని ఆళ్ల చెప్పారు. తన తమ్ముడు ఆర్కే తొలి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ముందుకు సాగుతున్నాడని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు దశరథరామిరెడ్డి, వీరరాఘవమ్మలు వృద్ధాప్యంలో ఉండి కూడా ‘మా గ్రామాన్ని మేం అభివృద్ధి చేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పేదల అభ్యున్నతి కోసం తపించే వైఎస్ జగన్ కుటుంబానికి ఆళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పెదకాకాని పంచాయతీ ఎన్నికల్లో అమ్మను భారీ మెజారిటీతో గెలిపించినవిధంగానే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటరమణ మాట్లాడుతూ పెదకాకానిలో ఇప్పటికే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, వైఎస్ జగన్‌అధికారంలోకి రావడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. సమైక్యాంధ్రకు అం డగా ఉంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేవిధంగా గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. తొలుత పెదకాకాని సెంటర్‌లోని శ్రీ పేరంటాళ్ళమ్మ ఆలయంలో పూజలు చేసి ర్యాలీగా పాతూరు చేరుకున్నారు. పాతూరులో ముస్లిం మైనార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం ప్రారంభించారు. సర్పంచి ఆళ్ళ వీరరాఘవమ్మ, మాజీ సర్పంచి ఆళ్ళ ఆయోధ్యరామిరెడ్డి, సొసైటీ అధ్యక్షురాలు జొన్నల ఉషారాణి, వెనిగండ్ల సర్పంచి కాట్రోత్ తులసీబాయి, అగతవరప్పాడు సర్పంచి ప్రభాకర్, మాజీ ఎంపీపీ దోసపాటి నాగేశ్వరరావు, శివాలయం మాజీ చైర్మన్ కొండా సుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Advertisement