సాక్షిప్రతినిధి విజయనగరం: ఓ వైపు సెలయేటి పరవళ్లు.. మరో వైపు చుట్టూ దట్టమైన కొండలు... మధ్యలో వంపుసొంపులు తిరిగే రహదారులు... ఎటు చూసినా చూడచక్కని పచ్చని తివాచి పరచుకున్నట్లున్న పంట పొలాలు... అంతటా పల్లె వాతావరణం.. నడుమ టీడీపీ దుష్టపాలనపై సమరభేరి మోగిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంల్పయాత్ర జిల్లాలో చివరి అంకానికి చేరుకుంది. 36 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్ ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనున్నారు. కురుపాం నియోజకవర్గంలో 304వ రోజు జననేత పాదయాత్ర పూర్తిగా జియ్యమ్మవలస మండలంలో సాగింది. అడుగడుగునా జననేతకు అఖండ స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. శిఖబడి క్రాస్ నుంచి ప్రారంభమై బి.జె.పురం, గెడ్డ తిరువాడ, ఇటిక చేరుకున్నారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజనానంతరం కుందర తిరువాడ క్రాస్, చినుకుదమ క్రాస్, తురకనాయుడువలస వద్ద ముగిసిం ది. మధ్యాహ్న భోజన విరామ సమయం అనంతరం ఇటిక క్రాస్ వద్ద చినకుదమ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ టీడీపీని వీడి జననేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
వెల్లువెత్తిన వినతులు
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో తాము అనుభవించిన కష్టాలను జననేత వద్ద బాధితులు ఏకరువు పెట్టారు. సర్వశిక్షాభియాన్‌లో 16 సంవత్సరాలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేస్తున్న 650 మంది కనీస వేతనాలకు నోచుకోవటం లేదని, పని ఒత్తిడి కారణంగా రకరకాల వ్యాధులబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ నాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేసి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందిస్తే... ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ దానిని నీరుగార్చిందని ఆదివాసీ ట్రైబుల్ యూనియన్ పాస్టర్స్ తెలి పారు.
విద్యార్థుల కోసం ప్రతి గ్రామ పంచాయతీలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామానికి చెందిన చిన్నారావు కోరారు. ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఏడు గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా జరగకపోవటంతో పంట సాగు కష్టతరంగా మారుతోందని చినకుదమకు చెందిన మహిళా రైతు గుంట్రెడ్డి భారతి వాపోయారు. తోటపల్లి బ్యారేజీపై ఎత్తిపోతల పథకం నిర్మించేంత వరకు తమకు 24 గంటలు త్రిఫేజ్ విద్యుత్‌సరఫరా ఇవ్వాలని కోరారు.
నాయకుడి వెంట నడిచిన సైనికులు
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ఫశ్రీవాణి, మాజీ ఎంపీ బాలశౌరి, మాజీ ఎమ్మెల్యేలు పేర్నినాని, పాలవలస రాజశేఖరం, బొత్స అప్పలనర్సయ్య, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు, విజయనగరం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, బెల్లాన చంద్రశేఖర్, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త గొడ్డేటి మాధవి, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా కో ఆర్డినేటర్ వరుదు కళ్యాణి, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, జెడ్పీ మాజీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం జెడ్పీటీసీ శెట్టిపద్మావతి, కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి అడుగూ ఓ చరిత్ర:
జిల్లాలో పర్యటన మొత్తం చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 24న జిల్లాలో అడుగిడిన పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటడం ద్వారా చారిత్రక ఘట్టానికి సూచికగా పైలాన్‌ను జననేత ఆవిష్కరించారు. చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్ల మైలు రాయిని, సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన జననేత తాజాగా శనివారం కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం తురకనాయుడు వలసలో 3300 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. ఈ సందర్బంగా జగన్‌మోహన్‌రెడ్డి మొక్కను నాటడంతో పాటు పార్టీ జెండాను ఎగురవేసి ముందుకు సాగారు.
నేటితో జిల్లాలో యాత్ర పూర్తి
విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం పూర్తయి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది. 36 రోజుల పాటు బహుదూరపు బాటసారి పాదయాత్ర చేయగా.. మధ్యాహ్న భోజన విరామ అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కెళ్ల గ్రామంలోకి అడుగిడనున్నారు. ఈ సందర్బంగా తమ అభిమాన నాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు జిల్లా నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment