నడిచొచ్చిన నమ్మకం.. | YS Jagan Praja Sankalpa Yatra in Vizianagaram Special Story | Sakshi
Sakshi News home page

నడిచొచ్చిన నమ్మకం..

Published Mon, Jan 7 2019 8:11 AM | Last Updated on Mon, Jan 7 2019 8:11 AM

YS Jagan Praja Sankalpa Yatra in Vizianagaram Special Story - Sakshi

జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన నాగిరెడ్డి విజయకుమార్‌ (ఫైల్‌ఫొటో)

ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి అనే నమ్మకం జిల్లాకు నడిచొచ్చింది.‘సంకల్ప’ బలంతో పాదయాత్రను ముందుకు సాగించింది. జిల్లాలో రాజకీయ చైతన్యం తెచ్చింది. ప్రజలకు భరోసా కల్పించింది. నేతల్లో విశ్వాసం నింపింది. అన్నివర్గాల ప్రజలకు చేరువుగా నిలిచింది. అందుకే... జననేతకు అండగా నిలిచేందుకు ఇతర పార్టీ నేతలు సైతం ముందుకొచ్చారు. పాదయాత్రలో అడుగు కలిపారు. ప్రజలకు మంచిచేసేందుకు అండగా ఉంటామంటూ జననేతకు మాట ఇచ్చారు. అదే నమ్మకంతో వచ్చే ఎన్నికల్లో పార్టీను గెలిపించేందుకు కృషిచేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర మరో రెండు రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో జిల్లాలోని రాజకీయచేరికలు, మార్పులనుఓ సారి పరికిస్తే..

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లా అంతటా ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్ర జిల్లా రాజకీయాల్లో చైతన్యం తెచ్చింది. పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. అధికార టీడీపీ నుంచి ప్రతినియోజకవర్గంలోనూ భారీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి నేతలు వరుసకట్టారు. జగన్‌ పాదయాత్రతో టీడీపీ వర్గాల్లో అభద్రతా భావం ఏర్పడింది. ఇటు సామాన్య ప్రజానీకం తామెవరికి ఓటు వేయాలనేదానిపై స్పష్టమైన నిర్ణయానికివచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం నిర్వహిస్తున్న రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యాక్రమానికి పోటెత్తుతున్న జన సందోహమే దానిని నిదర్శనం.

అడుగులో అడుగు కలిపి...
జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన పాదయాత్ర ఫలాలు కళ్లముందు కదలాడుతున్నాయి. తమ ప్రియతమ నేత జిల్లాలోని కొత్త వలసలో అడుగుపెట్టిన క్షణం నుంచి పాదయాత్ర ముగిసిన రావివలస జంక్షన్‌ వరకూ ప్రజలు ఆయన వెంట పరుగులెత్తారు. జగన్‌ మోహన్‌ రెడ్డి సెప్టెంబర్‌ 24న పాదయాత్ర పారంభించినపుడు ఆయన సమక్షంలో పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్‌.కోట నియోజకవర్గంలోని వేపాడ మండలం బొద్దాం ఎంపీటీసీ సభ్యురాలు జనపరెడ్డి ఈశ్వరమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జగ్గారావులు పార్టీలో చేరారు. అలాగే, వావిలపాడు తాజామాజీ సర్పంచ్‌ బీల రాజేశ్వరి జగన్‌ సమక్షంలో తమ అనుచరులతో పార్టీలో చేరారు. ఎల్‌ కోట మండలంలోని దాసుళ్లపాలెం, శ్రీరామపురంలో నాయకులు పార్టీలో చేరారు. అన్ని మండలాల్లోనూ పార్టీలో చేరిన వారి సంఖ్య పెరిగింది.

జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అనే తేడా లేదు..
జగన్‌ సంకల్పాన్ని చూసిన తర్వాత జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అనే తేడా లేకుండా ఆయన వెంట నడిచేందుకు నేతలు ముందుకు వచ్చారు. విజయనగరంలో భారీ జనసందోహం నడుమ పాదయాత్ర చేపడుతున్నప్పడు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు తన అనుచరులతో పార్టీలో చేరారు. ఈ సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, వివిధ సంస్థల్లో పనిచేసే వారు ఆయనతో పాటు వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి చెందిన పలువురు యువత, ప్రజలు, మహిళలు పలు విడతలుగా సుమారు నాలుగు వందల మందికి పైగా పార్టీలో చేరారు. దీంతో పార్టీలో నూతనోత్తేజం కలిగింది. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కోలగట్ల వీరభద్రస్వామిని పార్టీ అభ్యర్థిగా సాక్షాత్తూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించడం జిల్లాకు ప్రాధాన్యతనిచ్చినట్టయింది. దీంతో ఇక్కడి శ్రేణులు, కోలగట్ల అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ మరిన్ని చేరికలు జరిగాయి. నెల్లిమర్లలో పాదయాత్ర అనంతరం ఇక్కడి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అట్టాడ రాము సుమారు 50 కుటుంబాలతో పార్టీలో చేరారు. చీపురుపల్లిలో పాదయాత్ర ఆసాంతం ప్రజల్లో ఉరకలెత్తించింది. పాదయాత్ర అనంతరం ఇక్కడి ప్రజలు పూర్తిగా వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తున్నారనడంలో సందేహం లేదు.

అధికారపక్షానికి గట్టి దెబ్బ..
ప్రజా సంకల్పయాత్ర అధికార పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. గజపతినగరం మండలం లోగిశ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు సామంతుల పైడిరాజు తన అనుచరులతో పార్టీలో చేరారు. పాదయాత్ర అనంతరం దత్తిరాజేరు మండలం వింధ్యావాసి తాజామాజీ కోల సత్తిబాబు, మాజీ సర్పంచ్‌ ఉరిటి అప్పలనాయుడులు పార్టీలో చేరారు. దీంతో అక్కడ మరింత బలం పెరిగినట్టయింది. బొబ్బిలి నియోజకవర్గంలో పాదయాత్ర ఉవ్వెత్తున సాగింది. ఇక్కడి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం పార్టీని వదిలి టీడీపీలో చేరడంతో అతనిని విశ్వసించలేని ప్రజలు జగన్‌ పాదయాత్రతో ఉరకలెత్తారు. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన దివంగత ఎమ్మెల్యే తెంటు జయప్రకాశ్‌ మేనల్లుడు నాగిరెడ్డి విజయకుమార్, ఆయన సోదరుడు తెంటు వేణు కుమారుడు ప్రీతమ్‌ జగన్‌ సమక్షంలో రామభద్రపురం వద్ద పార్టీలో చేరారు. బాడంగి మండలం ముగడ టీడీపీ కంచుకోట అయినప్పటికీ నాగిరెడ్డి విజయకుమార్‌ చేరికతో పార్టీకి బలం పెరిగిందని చెప్పవచ్చు. బొబ్బిలి మండలం జగన్నాధ పురం మాజీ  ఎంపీటీసీ సభ్యురాలు బొద్దల పద్మ, కమ్మవలస తాజా మాజీ సర్పంచ్‌ కనిమెరక గౌరమ్మ, మాజీ సర్పంచ్‌ బి.సత్యనారాయణలు శంబంగి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రామభద్రపురం మండలం బూసాయవలస, ఆరికతోట, కొండపాలవలస, ఇట్లామామిడి పల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరిగి పార్టీలోకి తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది. పార్వతీపురంలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మజ్జి నాగమణి, మాజీ వైస్‌ చైర్మన్‌ దొడ్డి బాలకృష్ణ, మాజీ కౌన్సిలర్లు బత్తుల సూర్యనారాయణ, వారణాసి గున్న, వానపల్లి శరత్‌బాబులు పార్టీలో చేరారు.

ఆ ఆప్యాయతకు ఫిదా..
సాధారణంగా ఏ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థయినా నియోజకవర్గ నాయకులతో మమేకమై ఇక్కడి పరిస్థితులను తెలుసుకుని వారికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే, జిల్లాలో జరిగిన పాదయాత్ర కొత్త రూపు సంతరించుకుంది. ఇక్కడ పాదయాత్ర నడచినంత కాలం జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకులతో పాటు ప్రజలకూ అధిక ప్రాధాన్యమిచ్చారు. వారి సమస్యలు సావదానంగా విన్నారు. పాదయాత్రలో జనసందోహం కారణంగా చెప్పులు జారిపోయి ఎండలో విలవిల్లాడుతున్న వృద్ధులకు, చిన్నారులకు చెప్పులను సైతం సవరించి తొడిగి ఆయా ప్రాంతాల వారికి అభిమాన పాత్రుడయ్యారు. అలాగే, సొమ్మసిల్లిన వారికి తన వ్యక్తిగత సిబ్బందిచే ఊరట కలిగించేంత వరకూ విడిచిపెట్టలేదు. ఆనారోగ్య, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి తన వ్యక్తిగత సిబ్బందిచే సాయమందించే ఏర్పాట్లు చేశారు.

ఆనాటి నుంచీ వెన్నంటే...
నవరత్నాల పథకాల ప్రచారంతో ప్రజలకు భరో సా కలగడంతో పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్సార్‌ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. సాలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు పాదయాత్రకు హాజరయ్యారు. సాలూరు పట్టణంలో ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చి జగన్‌ మోహన్‌ రెడ్డికి సంఘీభావం పలికారు. జననేత మక్కువ పర్యటనలో ఉండగా విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. దీంతో ప్రజలు ఉద్వేగానికి గురయ్యా రు. జననేతకు ఏమీ జరగకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కుకున్నారు. అనంతరం స్వల్ప విరామంతో ప్రారంభమయిన పాదయాత్రకు జనం వెల్లువలా ఉప్పొంగారు. అక్కడి నుంచి పాదయాత్ర మరింత ఉత్సాహంతో జనం వెంట రాగా నభూతో నభవిష్యత్‌ అన్న రీతిన ముందుకు సాగింది. కురుపాంలో ఏజెన్సీ ప్రాంతాల నుంచి సైతం హరిజన గిరిజనులు ముందుకు వచ్చారు. ఎన్నో అపురూప క్షణాలతో జనానికి కలకాలం గుర్తుండిపోయే ప్రపంచస్థాయి రికార్డు పాదయాత్ర జిల్లాలో జరగడంతో ప్రజలు నేటికీ ఆ సెల్ఫీలను, తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ మరో అంకమయిన ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న రావాలి జగన్‌–కావాలి జగన్, నిన్నునమ్మం బాబూ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున హాజరవుతూ సంఘీభావం తెలుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement