సాక్షి, తాడేపల్లి: విద్యా రంగంలో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నాడు–నేడులో భాగంగా స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను ఆయన పరిశీలించి, అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నమెంటు స్కూళ్లలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫర్నీచర్ ఏర్పాటు చేయడమే కాదు, వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమన్న ఆయన పలు సూచనలు చేశారు. పిల్లలకు రెండు రకాలుగా ఉపయోగపడే బల్లలు, గ్రీన్ చాక్ బోర్డు, వాటర్ ప్యూరిఫైర్, ఫిల్టర్, అల్మరాలు, సీలింగ్ ఫ్యాన్లను సీఎం స్వయంగా చూశారు. పిల్లలు కూర్చునే బల్లల నమూనాలను సీఎం పరిశీలించారు.
అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నాడు-నేడు కార్యక్రమం నిలిచిపోతుందని అన్నారు. జులై చివరికి అన్ని పాఠశాల్లో నాడు-నేడు పూర్తి చేస్తామని, ఇప్పటికే చాలాచోట్ల పనులు ఊపందుకున్నాయని వివరించారు. మొదటి దశలో నాడు-నేడు కింద 15,700 మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామని వివరించారు. నాడు-నేడు మీద సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించిర టెండర్లు ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి తెలిపారు. (ఈ నెల 11న ఏపీ కేబినెట్ సమావేశం)
టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్:
నాడు-నేడు కార్యక్రమం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మొదట దశలో 500 కొత్తగా జునియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘జగన్న గోరు ముద్ద’ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు.
వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు
దిలీలు కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యే లోపు టీచర్ల బదీలీలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు లేరన్న సాకుతో స్కూళ్లు మూసివేయడం లేదని చెప్పారు. గతం ప్రభుత్వం హయాంలో 7 వేలకు పైగా స్కూళ్లు మూసేశారని తెలిపారు. ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment