
హంద్రినీవా, గండికోటపై వైఎస్ జగన్ సమీక్ష
వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం హంద్రినీవా, గండికోట ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
కడప : వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం హంద్రినీవా, గండికోట ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన కడప స్టేట్ గెస్ట్ హౌస్లో అధికారులతో భేటీ అయ్యారు. రాయలసీమకు ప్రధానమైన ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డంకులపై ఆయన ఆరా తీశారు.
ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కావలసిన వివరాలు, ఇతర అనుమతుల అంశాలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ప్రభుత్వం కేవలం 20 శాతం నిధులు ఇస్తే...ప్రాజెక్టులు పూర్తి అవుతాయి కదా అని ఆయన అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ మూడో రోజు కూడా బిజీబిజీగా గడపనున్నారు. ఆయన పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలను పరామర్శించనున్నారు. వేములపల్లి మండలం గొల్లపల్లిలో సూర్యనారాయణ కుటుంబంతో పాటు, రాజారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు.