మీరు మావైపు వచ్చే దాకా అటున్నట్టే! | Ys Jagan mohan reddy slams BJP in first AP assembly session | Sakshi
Sakshi News home page

మీరు మావైపు వచ్చే దాకా అటున్నట్టే!

Published Sat, Jun 21 2014 4:00 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

మీరు మావైపు వచ్చే దాకా అటున్నట్టే! - Sakshi

మీరు మావైపు వచ్చే దాకా అటున్నట్టే!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లో రెండో రోజయిన శుక్రవారం మాటల తూటాలు పేలాయి. శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయిన కోడెల శివప్రసాదరావుకు అభినందనలు తెలిపే సమయంలో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

* బీజేపీకి జగన్ చురక
* బీజేపీ నేతల అభ్యంతరం కలలు కనొద్దన్న యనమల
* ఆ దేవుడే నిర్ణయిస్తాడన్న జగన్
* తడబడిన యనమల.. సభలో నవ్వులు

 
 సాక్షి, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లో రెండో రోజయిన శుక్రవారం మాటల తూటాలు పేలాయి. శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయిన కోడెల శివప్రసాదరావుకు అభినందనలు తెలిపే సమయంలో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు ఒకసారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యలతో మరోసారి మాటల యుద్ధం నడిచింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ సభలో ప్రస్తుతం రెండే పార్టీలున్నాయని అన్నారు. మూడో పార్టీగా తామూ ఉన్నామని బీజేపీ సభ్యుడు, మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ‘మీరు మా వైపు (ప్రతిపక్షం) వచ్చే దాకా మీరు ఆవైపు (అధికారపక్షం) ఉన్నట్టే’ అని జగన్ బదులిచ్చారు.
 
 దానికి శ్రీనివాస్ ‘మాది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీతో ఎలా కలుస్తాం’ అంటుండగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకున్నారు. ‘‘జగన్ ఇంతవరకు అధికారం కోసం కలలు కన్నారు. ఇప్పుడూ కంటున్నారు. మేము ఎప్పటికీ అధికారపక్షమే, మీరు ప్రతిపక్షమే’’ అన్నారు. (ఈ సందర్భంలో యనమల తడబడ్డారు. మేమెప్పుడూ అధికారపక్షమే అనబోయి ప్రతిపక్షమే అనడంతో సభలో నవ్వులు విరిశాయి. ప్రతిపక్ష సభ్యులు బల్లలు చరిచారు) యనమల వ్యాఖ్యలను జగన్ తిప్పికొడుతూ అధికారాన్ని దేవుడు నిర్ణయిస్తారన్నారు. ‘‘1999లో నాన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పాలకపక్షంలో ఉన్నారు. అదే శాశ్వతమని అప్పట్లో టీడీపీ చెప్పింది. కానీ ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఎన్నికల్లో నాన్న అధికారంలోకి వచ్చారు. అధికారం అన్నది దేవుడు ఇస్తాడు. ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజలకు విడిచిపెడదాం. ఇక్కడివరకు సమస్యలపై దృష్టి పెడదాం. ప్రజాసేవకు పని చేద్దాం’’ అని చెప్పి ఆ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టారు.
 
 మీ పడవ బోల్తా పడుతుంది: జలీల్ ఖాన్
 వైఎస్సార్ సీపీ సభ్యుడు జలీల్ ఖాన్ ప్రసంగిస్తున్నప్పుడు యనమల వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. ‘‘ఈ అధికారమేదో పర్మినెంట్ అనుకుంటున్నట్టున్నారు యనమల.. ఇది పర్మినెంట్ కాదు. ఎంత తేడాతో ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చారో చూడండి. తక్కువ నీళ్లలో నడుస్తున్న మీ పడవ బోల్తాపడుతుంది. తొందర్లోనే మేము అధికారంలోకి వస్తాం’’ అని జలీల్‌ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిప్పికొడుతూ జలీల్ ఖాన్ టీడీపీనుంచి వెళ్లిన సంగతి తనకు బాగా తెలుసునన్నారు. ఈవైపు నుంచి వెళ్లిన వారే ఇప్పుడక్కడ ఉన్నారని చెప్పారు.
 
 దీనికి జలీల్ ఖాన్ తీవ్ర అభ్యంతరం చెబుతూ చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన వారేనని గుర్తుచేశారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘అంతెందుకు మీరు (గోరంట్ల) కూడా సీటు ఇస్తే ఇటు (వైఎస్సార్‌సీపీ) వైపు వస్తానని చెప్పిన వారేగా.. మా పార్టీలో (టీడీపీ) పరిస్థితి బాగా లేదన్న వారేగా? ఒక్క మైనారిటీ సభ్యుణ్ణి కూడా లేకుండా చేసుకున్న మీరా మాట్లాడేది?’’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ దశలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహావేశంతో ఊగిపోయారు. తన గురించి మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. నరనరాన తనలో టీడీపీ రక్తం ప్రవహిస్తోందని, తాను అడక్కుండానే తమ నాయకుడు చంద్రబాబు సీటు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
 
 సభకు కరెంటు కోత: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకూ కరెంటు కోత తప్పలేదు. ఉదయం సభ జరుగుతుండగానే సభలో కరెంటు పోయింది. 10.50 గంటల సమయంలో పోవడంతో సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే జనరేటర్లు ప్రారంభమైనప్పటికీ కరెంటు వస్తూ పోతూనే ఉంది. సభలో మైకులు కూడా సరిగా పని చేయలేదు. వెనుక వరుసలోని ఏ మైకూ పని చేయకపోవడంతో సభ్యులు ముందుకు వచ్చి మాట్లాడారు. కాగా, ఈ వేళ సందర్శకులతో సభ గ్యాలరీ కళకళలాడింది. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు గ్యాలరీ లో కూర్చుని కొద్దిసేపు సభా కార్యక్రమాలను తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement