రైతులను పిట్టల్లా కాల్చిన ఘనత చంద్రబాబుదే
బషీర్‌బాగ్ మృతులకు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నివాళి
సాక్షి, హైదరాబాద్: పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని పద్నాలుగేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్టు 28న) ఆందోళన చేసిన రైతులను పిట్టల్లా కాల్చిన ఘనత నాటి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుదేనని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆనాడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ముందుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలందరితో కలిసి జగన్ హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్ వద్ద గల అమరవీరుల స్తూపం సందర్శించి అమరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు, ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడుతూ ఉంటే పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపారని గుర్తుచేశారు. ఆ ఉద్యమంలో మరణించిన అమరవీరులకు నివాళులర్పించడం తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని జగన్ అన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన వారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఆర్.కె.రోజా, తిరువీధి జయరాములు, పాలపర్తి డేవిడ్‌రాజు, షేక్ బేపారి అంజాద్‌బాష, ముస్తఫా, సుజయ్‌కృష్ణ రంగారావు, ఆదిమూలం సురేష్, బూడి ముత్యాలనాయుడు, ఎస్.వి.మోహన్‌రెడ్డి, కలమట వెంకటరమణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, కిడారు సర్వేశ్వరరావు, ఐజయ్య తదితరులు ఉన్నారు.