4నుంచి వైఎస్ జగన్ రైతుభరోసా యాత్ర
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఈ నెల 4వ తేదీ నుంచి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన ఇవాళ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో భరోసా నింపడమే ఈ యాత్ర ఉద్దేశమన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు పూర్తిగా సాగు సంక్షోభంలో ముగినిపోయాయని, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు.
ఏపీలో వృద్ధి రేటు బాగుందని చెప్పి కేంద్ర నిధులు కూడా రాకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నిర్వాకంతో వ్యవసాయ రంగం కుదేలవుతోందని నాగిరెడ్డి విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముచ్చుమర్రి లిప్ట్ ఇరిగేషన్ పథకం పనులను వైస్ రాజశేఖరరెడ్డే తొంభై శాతం పనులు పూర్తి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.