కర్నూలు: ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. శనివారం ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్.. బోయరేవులు చేరుకున్నారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
బ్యాంకులో రూ. 30వేలు అప్పు చేసిన చాకలి వెంకటేశ్వర్లు.. ప్రైవేటుగా వడ్డీ వ్యాపారి వద్ద రూ. మూడు లక్షల 70వేలు అప్పు చేశారు. పంట చేతికి అందకపోవడం, ఈ అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోవడం, చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ఆయన తనువు చాలించారు. రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఓదార్చి.. ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వారికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన మోత్కూరు, తిమ్మనపల్లి, బండిఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంతజూటూరు మీదగా లింగాపురం చేరుకుంటారు.