నేడు గరగపర్రుకు వైఎస్ జగన్
♦ సాంఘిక బహిష్కరణకు గురైన వారిని పరామర్శించనున్న ప్రతిపక్ష నేత
♦ సాయంత్రం కాకినాడ ఆస్పత్రిలో గిరిజనులకు జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, పిప్పర మీదుగా 11 గంటలకు గరగపర్రు చేరుకుంటారని వైఎస్సార్ సీపీ ప్రోగ్రామింగ్ కమిటీ ఛైర్మన్ తలశిల రఘురామ్ తెలిపారు. అనంతరం జగన్ గరగపర్రు నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా తూర్పు గోదావరి జిల్లా చేరుకుంటారు.
సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని విషజ్వరాలు, అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శిస్తారు. రాత్రికి జగన్ రంపచోడవరం చేరుకుని అక్కడ బస చేస్తారని తలశిల రఘురామ్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ కొయ్యే మోషేన్‌రాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్ తదితరులు గరగపర్రులో ప్రతిపక్ష నేత జగన్ పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
హడావుడిగా కదిలిన యంత్రాంగం
దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన ఘటనపై రెండు నెలల పాటు మీనమేషాలు లెక్కించిన అధికార యంత్రాంగం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శుక్రవారం గరగపర్రులో పర్యటించనున్న నేపథ్యంలో ఆగమేఘాలపై కదిలింది. ప్రజాప్రతినిధులు గ్రామానికి వరుస కట్టడం ప్రారంభించారు. అధికారులు ఎప్పటిప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ఇన్నాళ్లూ విచారణ జరుపుతున్నామని, అరెస్ట్‌కు సమయం పడుతుందని చెబుతూ వచ్చిన పోలీసు అధికారులు.. నిందితులను అరెస్ట్ చేసినట్టు గురువారం ఉదయం భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించి చెప్పారు. 60 మంది సాక్షులను విచారించి నిందితులు ఇందుకూరి బాలరామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, కొప్పుల శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ ఎం.రవిప్రకాష్ ప్రకటించారు. గరగపర్రు గ్రామంలో ఏప్రిల్ 23న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు మంచినీటి చెరువు గట్టుపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించటంతో Ðవివాదం మొదలైన సంగతి తెలిసిందే.