మంగళవారం ‘స్పందన’పై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ఇసుక రీచ్‌లను తెరవాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వారిని అనుమతించాలని.. కిలోమీటర్‌కు నిర్దేశించిన చార్జీ రూ.4.90 చొప్పున రవాణా చేసే వారందరినీ తీసుకోవాల్సిందిగా ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం స్పందన కార్యక్రమంపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక లభ్యత, సరఫరా స్థితిగతులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లాల్లో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని, ఆ అధికారి కేవలం ఈ పని మాత్రమే చూడాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలని, దీనిపై కలెక్టర్లు, ఎస్పీలు దృష్టి పెట్టాల్సిందిగా ఆయన ఆదేశించారు. రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనుమతించొద్దని.. గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా కచ్చితంగా కనిపించి తీరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంచేశారు. ఇసుక మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దన్నారు. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరాను నిరోధించేందుకు చెక్‌పోస్టుల్లో నిఘాను పెంచాల్సిందిగా ఆయన సూచించారు. ఇసుక కొరతనేది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
రెండు నెలల్లో మార్పు రావాలి
రైతుల భూముల్లో ఇసుక ధర రూ.60 నుంచి రూ.100లకూ పెంచినా అభ్యంతరంలేదని వైఎస్ జగన్ అన్నారు. కానీ, ఇసుక సరఫరాపై వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాల్సిందేనని స్పష్టంచేశారు. కాగా, వరదల కారణంగా ఇసుక తరలింపు సాధ్యం కావడంలేదని కలెక్టర్లు చెప్పగా.. ప్రస్తుతం వరదలు తగ్గినందున తక్కువ రేట్లకు సత్వరంగా ఇసుకను అందించడంపై అధికారులు దృష్టిసారించాలని సీఎం కోరారు. ప్రతి జిల్లాలోని 2 వేల మంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్‌ను కూడా కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు ఇచ్చేలా చూడాలని, దీనిపై మార్గదర్శకాలు వెంటనే రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment