వివి వినాయక్కు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఫోన్లో పరామర్శించారు. వివి వినాయక్ తల్లి నాగరత్నమ్మ (61) మృతి పట్ల జగన్ సంతపం తెలిపారు. వివి వినాయక్ తల్లి నాగరత్నమ్మ (61) మంగళవారం సాయంత్రం మరణించారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో బుధవారం నిర్వహించనున్నారు.
అలాగే నైజీరియాలో కిడ్నాపైన గుంటూరు జిల్లా వాసి టి.శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఫోన్లో పరామర్శించారు. కిడ్నాపర్ల చెర నుంచి శ్రీనివాసరావును విడిపించేందుకు కృషి చేస్తామని అతడి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కిడ్నాప్ అంశంపై కేంద్రంతో సంప్రదించాలని ఆయన పార్టీ ఎంపీలను ఆదేశించారు. అలాగే శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితి సమీక్షించాలని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ సూచించారు.