నేటి నుంచి జనభేరి
- జిల్లాకు వైఎస్ విజయమ్మ రాక
- రెండు రోజుల పాటు ఐదు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభలు
- పెనుగంచిప్రోలులో ప్రారంభం.. జి.కొండూరులో ముగింపు
సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ సోమవారం నుంచి రెండు రోజులపాటు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైఎస్సార్ జనభేరి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం విజయమ్మ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఆదివారంతో యాత్ర ముగించుకొని సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రెండు రోజుల పాటు ఐదు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించేలా నేతలు షెడ్యూలు రూపొందించారు.
ఇందులోభాగంగా సోమవారం జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో పర్యటించి రోడ్‌షో, పలుచోట్ల సభల్లో ఆమె ప్రసంగిస్తారు. మంగళవారం గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది. తొలిరోజు ఉదయం 10 గంటలకు పెనుగంచిప్రోలులో యాత్ర ప్రారంభించి రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడినుంచి అనిగండ్లపాడు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శివాపురం, జొన్నలగడ్డ, కొణతమాత్మకూరు, దాములూరులో రోడ్‌షో నిర్వహిస్తారు.
ఆ తర్వాత నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలంలోకి యాత్ర చేరుకుంటుంది. పల్లంకి, వెల్లంకి, జమ్మవరం, అన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరులో రోడ్‌షో సాగుతుంది. అల్లూరు గ్రామంలో సభలో మాట్లాడతారు. అనంతరం పెద్దాపురంలో రోడ్‌షో నిర్వహించి అక్కడ నుంచి మైలవరం నియోజకవర్గంలోని గూడెం మాధవరం చేరుకుంటారు.
ఉగ్గిరాలపాడు, గంగినేని, సున్నంపాడు, మునగపాడు, చెరువుమాధవవరం, జి.కొండూరులో రోడ్‌షో నిర్వహించి మొదటిరోజు యాత్ర ముగిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని వివరించారు.