సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ (వ్యవసాయ పరీక్షా కేంద్రాలు) ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాస్థాయిలో 13 అగ్రిల్యాబ్స్‌తో పాటు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో నాలుగు అగ్రిల్యాబ్ ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వెల్లడించింది.
అగ్రిల్యాబ్స్‌లో పరీక్షించిన తర్వాతే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతులకు విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ప్రభుత్వ అగ్రిల్యాబ్స్ ద్వారా ఇచ్చే దృవపత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అరికట్టడమే లక్ష్యంగా అగ్రిల్యాబ్‌లు పనిచేయనున్నాయి. ‘నాబార్డు’ ఆర్థిక సాయంతో ఏర్పాటు కానున్న అగ్రిల్యాబ్‌లను మార్కెటింగ్, పోలీస్ హౌసింగ్ శాఖలు నిర్మిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment