ప్రజా సమస్యలపై పోరాడదాం
అంబాజీపేట :ప్రభుత్వం అవలంస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సమస్యలపై శక్తివంచన లేకుండా పోరాడాలని ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్, ఏవీఆర్ కళ్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు అధ్యక్షతన పి. గన్నవరం నియోజకవర్గ సమీక్ష సమావేశం శనివారం జరిగింది. ఆ సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ అమలు, ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రైతు, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణమాఫీలో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటి నుండే కృషి చేస్తానన్నారు. మాజీమంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితిపై పరిపూర్ణ అవగాహన ఉన్న చంద్రబాబు, రుణ మాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రంపచోడవరం, కొత్తపేట ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతీ నాయకుడు, కార్యకర్త పోరాడుతూ పార్టీని మరింత పటిష్టపరచాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ చంద్రబాబు బడ్జెట్‌లో అంకెలు తప్ప నిధులు లేవని ఎద్దేవా చేశారు.
తొలుత పార్టీ మండల కన్వీనర్లు దొమ్మేటి సాయికృష్ణ, అడ్డగళ్ల వెంకట సాయిరాం, బొలిశెట్టి భగవాన్, మద్దా చంటి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, సర్పంచ్‌లు కాండ్రేగుల గోపి, తనికెళ్ల మణిబాబు, కసిరెడ్డి అంజిబాబులతో పాటు పలువురు జిల్లా అధ్యక్షుడు నెహ్రూకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయిలను ఘనంగా సన్మానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, విభాగపు కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, మంతెన రవిరాజు, శెట్టిబత్తుల రాజబాబు, గిరిజాల వెంకటస్వామినాయుడు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, అత్తిలి సీతారామస్వామి, ఎంపీటీసీ సభ్యులు ఉందుర్తి ఆనందబాబు, బూడిద వరలక్ష్మి, కోమలి అనంతలక్ష్మి, కోట విజయరావు, సీనియర్ నాయకులు ఎంఎం శెట్టి, పేరి శ్రీనివాసరావు, కొర్లపాటి కోటబాబు తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘అమలాపురం’ సమీక్ష
అమలాపురం : అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గస్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఆదివారం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పట్టణ పార్టీ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమలాపురం సూర్యానగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ సమావేశం జరుగుతుందని వారు వివరించారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా జ్యోతుల నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి జరుగుతున్న సమీక్షా సమావేశమని వారు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని పట్టణ, మండల పార్టీల కన్వీనర్లు, జిల్లా అనుబంధ కమిటీల కన్వీనర్లు, సభ్యులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని వారు కోరారు.