వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వనందువల్లే రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని చెబుతున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అసలు బుద్ధీ, జ్ఞానం ఉన్నాయా అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు
వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వనందువల్లే రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని చెబుతున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అసలు బుద్ధీ, జ్ఞానం ఉన్నాయా అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీకి రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునేంతటి బలం లేనందున ఎన్నికలకు దూరంగా ఉంటామని తమ పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి జనవరి 23నే స్పష్టం చేశారని, ఆదాల తన నామినేషన్‌ను దాఖలు చేసింది 28వ తేదీన అని గుర్తుచేశారు.
తాము అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తమను నమ్ముకుని నామినేషన్ వేశానని ఆదాల చెప్పడం సిగ్గులేని, నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. తమ పార్టీపై బురద జల్లాలనే ప్రయత్నమే ఇందులో కనిపిస్తోందన్నారు. ఆదాల వైఎస్సార్‌సీపీపై ఎవరి స్క్రిప్టు ప్రకారం విమర్శలు చేస్తున్నారో కూడా తమకు తెలుసన్నారు. రాష్ట్రం కలిసుంటే జగన్ గెలవడని జేసీ దివాకర్‌రెడ్డి చెబుతున్నవి పిచ్చి మాటలన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నపుడే కడప నుంచి జగన్ 5 లక్షల పైచిలుకు భారీ ఆధిక్యతతో గెలుపొందిన వాస్తవం విస్మరించారా, 17 ఎమ్మెల్యే స్థానాలను గెల్చుకున్న విషయం మరిచారా అని ఆమె ప్రశ్నించారు.
పోలింగ్‌కు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దూరం..
శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరాదని విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి విప్ జారీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల అగ్రనేతలను కలసి గురువారం రాత్రి నగరానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానుసారం పోలింగ్ కు గైర్హాజరు కావాలని నిర్ణయించారు.