సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కన్పిస్తోంది.
రాష్ట్ర శాసన సభలో మొత్తం 175 స్థానాలకుగాను 150 వైఎస్సార్‌సీపీవి. 23 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో స్థానంలో గెలవడానికి సగటున 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి ఉన్న ఎమ్మేల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. నాలుగు స్థానాలూ వైఎస్సార్‌సీపీ గెల్చుకుంటుంది.
2024 నాటికి 11 స్థానాలు వైఎస్సార్‌సీపీవే
రాజ్యసభలో రాష్ట్ర కోటా 11 స్థానాలు. ప్రస్తుతం ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులున్నారు (జూన్ 21తో పదవీ కాలం ముగిసే విజయసాయిరెడ్డి స్థానాన్ని మినహాయిస్తే). జూన్ 10న పోలింగ్ జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరతాయి. అప్పుడు వైఎస్సార్‌సీపీ బలం ఐదు నుంచి తొమ్మిదికి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యుల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం 2024 ఏప్రిల్ 22తో ముగుస్తుంది.
టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్‌ల పదవీ కాలమూ అదే రోజుతో ముగుస్తుంది. ఈ మూడు స్థానాలకు 2024 ఎన్నికలకు ముందు ఎన్నికలు జరుగుతాయి. శాసనసభలో సంఖ్యాబలం ఆధారంగా ఆ మూడు స్థానాలను కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకోనుంది. అప్పుడు రాష్ట్ర కోటాలోని 11 రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరతాయి.
సామాజిక న్యాయానికి పెద్దపీట
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020లో రాష్ట్ర కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిలో రెండు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార)లను రాజ్యసభకు పంపడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. మిగతా రెండు స్థానాల్లో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమల్ నత్వానీలను రాజ్యసభకు పంపారు.
నాలుగు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే
Published Fri, May 13 2022 4:37 AM | Last Updated on Fri, May 13 2022 4:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment