
సాక్షి, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దరిమిలా ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు విజయవాడలో ఈ నెల 16వ తేదీన శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. విజయవాడలోని బందర్ రోడ్డు, డీవీ మానర్ హోటల్ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో కార్యక్రమం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు ఆయా పార్లమెంటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హాజరు కావాలని పార్టీ ఆదేశించింది.
ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు తరగతులకు వచ్చే ప్రతినిధులకు అల్పాహారం, రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ ఏజెంట్లు, పోటీ చేసిన అభ్యర్థుల విధులపై పార్టీ పెద్దలు వివరిస్తారు. శిక్షణకు హాజరవుతున్న వారు విధిగా సమయపాలన పాటించాల్సి ఉంటుందని పార్టీ ఇప్పటికే సూచనలు పంపింది. ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానితులతో పాటుగా చీఫ్ ఎన్నికల ఏజెంట్లు అంతా విధిగా హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు పంపిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment