ఇది సమరానికి శ్రీకారమే
సాక్షి, కాకినాడ :రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు, పార్టీ శ్రేణులతో ఆర్డీఓ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించి సుమా రు గంటపాటు నినాదాలు చేశారు. గద్దెనెక్కిన రెండు నెలల్లోనే ఇంతలా ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ లేదని ఆదిరెడ్డి పేర్కొన్నారు. విభజన అనంతరం రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసీ మాఫీ హామీలతో ప్రజలను మాయచేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. బేషరతుగా అమలు చేయకుంటే ప్రజాతిరుగుబాటుకు గురికాక తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, రాష్ర్ట సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ర్ట ప్రచార కమిటీ సభ్యురాలు ఎన్.వసుంధర, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నేతృత్వంలో ర్యాలీ
కొత్తపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నరకాసుర వధ కార్యక్రమం జరిగింది. తొలుత జిల్లా పార్టీ అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు స్వగృహం నుంచి తహశీల్దార్ కార్యాలయం సెంటర్ వరకు పార్టీ శ్రేణులు, మహిళలు, రైతులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. డేవిడ్‌రాజుతో పాటు సేవాదళ్ జిల్లా కన్వీనర్ మార్గన గంగాధర్, జెడ్పీటీసీ సభ్యులు సాకా ప్రసన్నకుమార్, ఎంపీపీ కోట చెల్లయ్య, బొక్క వెంకటలక్ష్మి, రెడ్డి చంటి, ముసునూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎంపీ, మండపేట కోఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో రాయవరం వైఎస్సార్ సర్కిల్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. నీటి సంఘాల రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, వేగుళ్ల పట్టాభి రామన్న చౌదరి, జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాదేవి, మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో గండేపల్లిలో నరకాసుర వధ కార్యక్రమం జరిగింది. ధర్నా చేసి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కడియం సెంటర్‌లో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కడియం సొసైటీ అధ్యక్షుడు గిరజాల బాబు, పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. కాట్రేనికోన సెంటర్‌లో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఏలేశ్వరంలో సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర
చంద్రబాబు వైఖరికి నిరసనగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆదేశాల మేరకు ఆ పార్టీ శ్రేణులు శనివారం ఏలేశ్వరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మెయిన్‌రోడ్డు నుంచి బాలాజీచౌక్ వరకు చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి కొద్దిసేపు బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, ఎంపీపీ అయ్యల సత్యవతి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శిడగం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అలమండ చలమయ్యల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు, అన్నవరంలలో జాతీయ బ్యాంకుల వద్ద పార్టీ స్థానిక నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాల్లో మహిళలు, రైతులు పెద సంఖ్యలో పాల్గొన్నారు.
టీడీపీ నేతల నిర్వాకంతో ముంగండలో ఉద్రిక్తత
పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ముంగండలో నరకాసుర వధ కార్యక్రమానికి సిద్ధమవుతుండగా స్థానిక టీడీపీ నేతలు వచ్చి చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దహనం చేస్తే అంతు చూస్తాం అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ నేతలను అక్కడ నుంచి పంపించివేశారు. అనంతరం నిరసన కార్యక్రమం కొనసాగింది. మామిడికుదురు మండలం పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్, అంబాజీపేట సెంటర్‌లలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, కొమరాడ సెంటర్‌లో రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రోడ్లపై బైఠాయించి ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ర్ట రైతు విభాగం సభ్యుడు జక్కంపూడి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
మాఫీపై అంతా అయోమయమే..
రైతుల రుణమాఫీపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ఎప్పుడు, ఎలా చేస్తారనే దానిపై అయోమయం, గందరగోళమే తప్ప.. వడ్లగింజ మొనంత స్పష్టత కూడా లేదు.
- కాగితాపల్లి సుబ్బారావు, రైతు,
గంగలకుర్రు, అంబాజీపేట మండలం
అదనపు వడ్డీని ఎవరు భరించాలి?
చంద్రబాబు హామీని నమ్మి పాత రుణాలు చెల్లించలేదు. జూన్ 30 లోపు చెల్లిస్తే పావలా వడ్డీతో సరిపోయేది. ఇప్పుడు 13 శాతం వడ్డీ కట్టాలంటున్నారు. అంటే రూ.3 వేలతో పోయే దానికి రూ.13 వేలు కట్టాలన్నమాట. అదనపు వడ్డీని కట్టాల్సింది మేమా? ప్రభుత్వమా? ఏ మాత్రం స్పష్టత లేదు.
- యెనుమల నాగేంద్ర బాపిరాజు, రైతు,
కేశనపల్లి, మలికిపురం మండలం
బీమాకు అనర్హులవుతున్నాం
రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పంటల బీమాకు మేము అనర్హులమవుతున్నాం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో తెలియడం లేదు. ఈ అయోమయం తొలగేలా ఎవరూ స్పష్టతను ఇవ్వడం లేదు.
- పసుపులేటి లక్ష్మి, రైతు,
నేదునూరు, అయినవిల్లి మండలం
బ్యాంకులు నోటీసులిస్తుంటే.. టీడీపీ సంబరాలు
రుణమాఫీ అమలైనట్టే టీడీపీ సంబరాలు చేసుకుంది. ముఖ్యమంత్రిని అభినందించడానికి పోటీలు పడ్డారు. కానీ, బ్యాంకులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. రుణాలు చెల్లించాలని నోటీసులిస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని కరాఖండిగా చెపుతున్నాయి. ఈ తరుణంలో మాకు భరోసానిచ్చేదెవరు?
- అడబాల నారాయణస్వామి, రైతు,
కేశనపల్లి, మలికిపురం మండలం
ప్రతిపాదనలతో మభ్యపెట్టే యత్నం
రైతు రుణమాఫీపై రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎర్రరందనం తాకట్టు, నదుల్లో ఇసుక తవ్వకంపై సెస్ వంటి ఆచరణ సాధ్యం కాని విడ్డూరమైన ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారు. ఇవన్నీ మభ్యపెట్టే ఎత్తుగడలు మాత్రమే.
- వి.సత్యనారాయణ, రైతు,
అయినాపురం, ముమ్మిడివరం మండలం
రుణాలు చెల్లించమని మంత్రులే
చెపుతున్నారు..
బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. మంత్రులే.. పాత రుణాలు చెల్లించి, కొత్త రుణాలు చెల్లించాలని చెపుతున్నారు. అంటే రుణమాఫీకి అర్థముందా? అది ఎక్కడ అమలవుతోంది? - కె.వీరభద్రస్వామి, రైతు,
గాడిలంక, ముమ్మిడివరం మండలం