రాజకీయ విలువలు వీడి...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి.. స్వీయ ప్రయోజనాలే పరమావధిగా.. అధికార దాహంతో వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు జిల్లా నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, ఆదిరెడ్డి అప్పారావులు.. అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రలోభాల వలలో పడి.. దానికి అభివృద్ధి ముసుగు తొడిగి.. ఓటేసిన తమను వంచించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిరాయించే ముందు.. వైఎస్సార్‌సీపీతో దక్కిన పదవులకు రాజీనామా చేయాలనే నైతికతను కూడా పాటించకపోవడం.. విలువలను తుంగలో తొక్కడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీలో తమను తొక్కేస్తున్నారని చెబుతూ ఈ ముగ్గురు నేతలూ అప్పట్లో వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. పెద్దపీట వేసి, పదవులు ఇచ్చిన ఆ పార్టీని కాదని.. ఆ ముగ్గురు నేతలూ మళ్లీ అదే సైకిల్‌పై సవారీ చేస్తున్న తీరు చూసి జనం విస్తుపోతున్నారు.
గోరంట్లతో విభేదాలు తప్పవా?
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు భార్య వీరరాఘవమ్మ గతంలో టీడీపీ హయాంలో రాజమహేంద్రవరం మేయర్‌గా పని చేశారు. ఆమె పదవీ కాలం పూర్తయ్యాక అప్పారావు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. జిల్లా నుంచి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలి నాయకుడు ఆయన. ఈ పదవీ కాలం ఇంకా రెండేళ్లుంది. అయినప్పటికీ ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్‌సీపీని కాదని, అదురూ బెదురూ లేకుండా సైకిలెక్కేశారు. ఎమ్మెల్సీ పదవికి మించిన గౌరవం,∙హోదా ఆయనకు అక్కడ లభించాయా అంటే అవేమీ కనుచూపు మేరలో కూడా అక్కడ కనిపించడం లేదు. అప్పారావుపై భగ్గుమనే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలోనే ఉన్నారు. ఆయన అక్కడుండగా టీడీపీలో అప్పారావుకు రాజకీయ భవిష్యత్తు ఒక భ్రాంతేనని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఫిరాయించడానికి ముందే వైఎస్సార్‌సీపీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న నైతికత ఉన్నత విద్యావంతుడైన అప్పారావుకు లేకపోవడాన్ని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. తనవెంట 6 వేల మంది వచ్చారని అప్పారావు చెబుతున్నారు. వారిలో ఆయన వద్ద అప్పులు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారని పలువురు అంటున్నారు. వాస్తవంగా ఒకరిద్దరు మాత్రమే కొద్దోగొప్పో ప్రభావంతమైన ద్వితీయ శ్రేణి నేతలున్నారని, మిగిలినవారి పరిస్థితి తమకు తెలియనిది కాదని గోరంట్ల వర్గం అంటోంది. అప్పారావు పునరాగమనంతో తమకు కొత్తగా కలిసివచ్చేదేమైనా ఉందంటే అది పార్టీలో అంతర్గత కుమ్ములాటలేనని తమ్ముళ్ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
జగ్గంపేటకే పరిమితమైన జ్యోతుల
మరో ఫిరాయింపు నేత∙జ్యోతుల నెహ్రూ. రాష్ట్ర మంత్రి కావాలన్నది ఆయన చిరకాల కోరిక. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఆ పదవి ఆయనకు రానివ్వకుండా మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుపడ్డారు. నెహ్రూ వెంట తిరిగేవారిని ఎవరినడిగినా ఈ మాట చెబుతారు. తన రాజకీయ ఎదుగుదలకు యనమల ఆటంకంగా మారారన్న ఉద్దేశంతో నెహ్రూ.. అప్పట్లో టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ అదృశ్యమైన తరువాత వైఎస్సార్‌సీపీలో చేరారు. అటువంటిది మళ్లీ టీడీపీలోకి ఎలా వెళ్లారో అర్థం కావడం లేదని ఆయన అభిమానులే అంటున్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని నెహ్రూ అనుచరులు కొందరు చెబుతూంటారు. కానీ, ‘సైకిల్’ ఎక్కాక ఈ నాలుగు నెలల్లో నియోజకవర్గానికి ఏం సాధించారనే ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. వాస్తవానికి ఈ నాలుగు నెలల్లో కనబరిచింది అధికార దర్పమే. పోలవరం కాలువను ఆనుకుని నిరుపేదల ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్లు సాధించలేకపోయారని స్థానికులు మండిపడుతున్నారు. మరోపక్క నెహ్రూ చిరకాల కోరిక అయిన మంత్రి పదవిపై కనీస గ్యారంటీ లభించలేదనే చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీలో ఉండగా పార్టీ జిల్లా పగ్గాలతో పాటు అసెంబ్లీలో పార్టీ ఉపనేతగా తన వాణి వినిపించే నెహ్రూ.. టీడీపీలోకి ఫిరాయించాక జగ్గంపేటకే పరిమితమైపోవాల్సి వచ్చిందని అనుచరగణం ఆవేదన చెందుతోంది.
కుమారుడికి దక్కని
జెడ్పీ చైర్మన్ గిరీ
వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు జెడ్పీ ప్రతిపక్ష నేతగా పని చేసిన జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కు టీడీపీలో చేరితే జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. నెహ్రూకు మంత్రి పదవి, కుమారుడికి జెడ్పీ చైర్మన్ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని అప్పట్లో చెప్పుకున్నారు. చివరికి వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకూ వారికి దక్కనేలేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టిక్కెట్టుపై ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వరుపుల సుబ్బారావు గెలుపొందారు. ఆయన ఎక్కడ కనిపించినా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘సుబ్బన్నా’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గౌరవంగా చూసేవారు. ఎంతోమంది నేతలను కాదనుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్‌మోహన్‌రెడ్డి టిక్కెట్టు ఇచ్చి సుబ్బారావును ఎమ్మెల్యేను చేశారు. అటువంటి సుబ్బారావు కూడా టీడీపీ ప్రలోభాలతో పార్టీ ఫిరాయించడంపై విమర్శలు వస్తున్నాయి.
విలువలకు కట్టుబడి..
ఈ ముగ్గురితో పోలిస్తే రాజకీయాల్లో జూనియర్లు, తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజాలు.. అధికార టీడీపీ నుంచి అనేక ప్రలోభాలు వచ్చినా తప్పటడుగు వేయకుండా నిలిచారు. వీరిద్దరూ తమ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా వైఎస్సార్‌సీపీకే కట్టుబడి నిలవడం విశేషం.