
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు గురువారం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. క్రమంలేని ఆహార అలవాట్ల వల్ల, శరీరానికి విటమిన్లు సరిగ్గా అందక పోవడం వల్ల దృష్టి లోపం ఎక్కువగా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరికీ అలాంటి లోపం రాకూడదనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలందరికి ఈ సేవలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో మొదలు పెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఏ ఒక్కరు కంటి జబ్బులతో భాదపడకూడదన్నదే సీఎం జగన్ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన భూమన .. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు.
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి కంటి పరీక్షలు చేయిస్తామని, విద్యార్థులందరిలో వెలుగు నింపడమే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. అదే విధంగా నిమ్మనపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్లో మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా.. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు యాదమరిలోని హై స్కూళ్లో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే ఎన్ ఎస్ బాబు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment