
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : వైఎస్సార్ సీపీ బీసీ గర్జనకు ఏలూరు నగరం ముస్తాబైంది. సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హేలాపురి టౌన్‌షిప్ పక్కనే భారీస్థాయిలో బీసీ గర్జన మహాసభ జరగనుంది. ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీల అభ్యున్నతికి తాము ఏం చేయబోతున్నామో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. దీంతో బీసీ గర్జన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఏలూరు నుంచే వైఎస్ జగన్ ఎన్నికల సమరంలోకి దూకుతూ ప్రచార పర్వాన్ని ప్రారంభించబోతున్నారు.
దీంతో ఏలూరు బీసీ గర్జన మహాసభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఈ సభకు తరలిరానుండడంతో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు గంటల కొద్దీ నిలబడి ఇబ్బందులు పడకుండా కూర్చునేందుకు కుర్చీలు సైతంభారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే ప్రజల కోసం ఎల్‌సీడీలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
పార్టీ నేతల పరిశీలన
ఏలూరులో జరిగే బీసీ గర్జన మహాసభ పనులను పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, తలశిల రఘురాం, జంగా కృష్ణమూర్తి, నర్సయ్య గౌడ్, మేకా శేషుబాబు, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పరిశీలించారు. గర్జన సభ వేదిక నిర్మాణం పనులు, ప్రాంగణంలో ఏర్పాట్లు తదితర అంశా లను పర్యవేక్షించారు. జిల్లా నేతలు ఘంటా ప్రసాదరావు, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, మంచెం మైబాబు తదితర పార్టీ నేతలు ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
శ్రేణుల్లో ఉత్సాహం
బీసీ గర్జన కోసం పార్టీ నేతలు, శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే గర్జన సభ ప్రాంగణానికి ఇరువైపులా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.బీసీ వర్గాలతో పాటు ముఖ్యంగా యువత ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బీసీ డిక్లరేషన్‌పై ఉత్కంఠ
రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గంలోని 146 కులాలకు సంబంధించి, వారి అభ్యున్నతికి కీలకంగా మారే బీసీ డిక్లరేషన్‌ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించనుండడంతో ఆ వర్గాల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ అభివృద్ధి, సంక్షేమానికి జగన్ ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు, విధి విధానాలు ఎలా ఉంటాయనే అంశాలపై చర్చ సాగుతోంది. మూడు దశాబ్దాల కాలంలో ఏ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవటంతో వైఎస్ జగన్ ప్రకటించే డిక్లరేషన్‌కు అధిక ప్రాముఖ్యత ఏర్పడింది.