
మోదుగులపై నామా, రాథోడ్ దాడిచేస్తే చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్‌లు దాడి చేస్తే పార్టీ అధినేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. దాడులకు దిగిన నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గట్టు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తమపై దాడి జరుగుతుంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకోలేదంటూ మోదుగుల అసంబద్ధంగా మాట్లాడటం తగదన్నారు.
జగన్‌ను కొందరు మహబూబాబాద్‌లోకి రానివ్వకుండా పెద్ద ఎత్తున అల్లర్లు చేసి దాడులకు దిగినప్పుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఎప్పుడైనా ఖండించారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటీవల కోదాడలో వైఎస్ విజయమ్మ చేపట్టిన పర్యటనను అడ్డుకోవాలని మంత్రి జానారెడ్డి పిలుపు ఇచ్చినప్పుడు ఇది తప్పని ఎందుకు ఖండించలేదని నిలదీశారు. వైఎస్సార్‌సీపీలో అధ్యక్షుడు మొదలుకొని ప్రతీ కార్యకర్త ఒకే మాట మీద నిలబడ్డారని చెప్పారు. టీడీపీలో ఎవరు ఏం మాట్లాడతారో వారికే అర్థంకాకుండా ఉందని ఎద్దేవా చేశారు. ‘పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలో మొదటి ముద్దాయి సోనియాగాంధీ అయితే రెండో ముద్దాయి స్పీకర్, మూడో ముద్దాయి టీడీపీ’ అని అన్నారు.