
‘సమైక్యం’గా తరలిరండి
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ హైదరాబాద్‌లో ఈ నెల 26న తలపెట్టిన సమైక్య శంఖారావ సభ విజయవంతం కావాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణులు గురువారం సీమాంధ్రలో కదం తొక్కాయి.
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ హైదరాబాద్‌లో ఈ నెల 26న తలపెట్టిన సమైక్య శంఖారావ సభ విజయవంతం కావాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణులు గురువారం సీమాంధ్రలో కదం తొక్కాయి. కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బైక్ ర్యాలీలతో హోరెత్తించాయి. విద్యార్థులు, రైతులు, వివిధ వర్గాలవారు ఈ ర్యాలీలకు సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్రేయపురంలో, రంపచోడవరంలో కో- ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగాయి.
జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు జరిగాయి. ఏలూరులో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షాశిబిరాన్ని గురువారం వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పార్టీ కార్యకర్తలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన బైక్ ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీని నియోజకవర్గ సమన్వయకర్త ముక్కుకాశిరెడ్డి ప్రారంభించారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నేతృత్వంలో భారీ బైక్‌ర్యాలీ అనంతరం పూల అంగళ్ల కూడలిలో మానవహారం ఏర్పాటుచేశారు. విభజనవల్ల కలిగే నష్టాలను వివరిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంచిపెట్టారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ర్యాలీని ప్రారంభించగా, ఆదోనిలో సాయి ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ సాగింది. ఆళ్లగడ్డలో పార్టీ నాయకుడు బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆలూరు ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులో కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి మొదలైన రిలే దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.