రండి...కదలిరండి | ysrcp calls samaikya shankaravam 26th october | Sakshi
Sakshi News home page

రండి...కదలిరండి

Published Mon, Oct 21 2013 2:37 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సమైక్యాంధ్రప్రదేశ్‌ను పరిరక్షించే బాధ్యత భుజానికెత్తుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆ దిశగా కదం తొక్కుతోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సమైక్యాంధ్రప్రదేశ్‌ను పరిరక్షించే బాధ్యత భుజానికెత్తుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆ దిశగా కదం తొక్కుతోంది. రాష్ట్ర సమైక్యత పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ దళం కదులుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా యుద్ధభేరి మోగించనుంది. హైదరాబాద్‌లో ఈ నెల 26న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘సమైక్య శంఖారావం’ సభకు జిల్లా సమాయత్తమవుతోంది. ఈ సభకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివెళ్లనున్నారు. ఇందు కోసం వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఆదివారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
 
 కేంద్ర పాలకమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్,బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పాలేటి రామారావు, ముక్కు కాశిరెడ్డి, డేవిడ్‌రాజు, ఉడుముల శ్రీనివాసరెడ్డి, గొట్టిపాటి నర్సింహారావులు సమావేశానికి హాజరయ్యారు.వారితోపాటు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు  కాటం అరుణ మ్మ, అంగలకుర్తి రవి, అమృతపాణి, అవ్వా రు ముసలయ్య, సజ్జా హేమలత, ఉన్నం వీరాస్వామి, తూమాటి మాధవరావు, ముత్తుముల అశోక్‌రెడ్డి,వై.వెంకటేశ్వరరావు, వెన్నా హనుమారెడ్డిలతోపాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
 సమైక్యతా యజ్ఞం 
 తెలుగువారి ఐక్యత, భావి తరాల భవితను కాపాడటానికి పార్టీ చేపట్టిన మహాయజ్ఞంలా సమైక్య శంఖారావం సభను నిర్వహించాలని తీర్మానించారు.  రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఢిల్లీపై చేస్తున్న ప్రజాపోరాటంగా ఈ సభను అభివర్ణించారు.  ఈమేరకు  వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని పార్టీ నేతలకు బాలినేని వివరించారు. సమన్వయకర్తల నుంచి సామాన్య కార్యకర్త వరకు ఈ సభను దిగ్విజయం చేయడంలో భాగస్వామి కావాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సభకు హైదరాబాద్ తరలివెళ్లేలా చూడాలని కోరారు.  కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా... రాష్ట్ర సమైక్యత కోరుకునే అన్ని వర్గాలు వచ్చేలా చేయాలన్నారు. అందుకోసం అన్ని వర్గాల ప్రజలను కలసి సమైక్య శంఖారావం సభ ఆవశ్యకతను వివరించాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఈ సభే చివరి అవకాశంగా ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేయాలని, సోమవారం నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు ఇలా అన్ని వర్గాల మద్దతు ఈ సభకు కూడగట్టాలని నిర్ణయించింది.  
 
 వందలాదిగా వాహనాలు...వేలాదిగా ప్రజలు
 జిల్లావాసులు రాష్ట్ర రాజధానిలో సమైక్య వాణిని మార్మోగించనున్నారు.  సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో జనం తరలివెళ్లనున్నారు. ఈమేరకు బాలినేని ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ సభకు జనసమీకరణ, వాహనాల ఏర్పాటుపై నిశితంగా చర్చించారు. నియోజకవర్గాలవారీగా నేతలతో మాట్లాడి  కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. నియోజకవర్గానికి సగటున 5వేల మంది చొప్పున వెళ్లేందుకు సన్నాహాలు చేపట్టారు.  ఆ ప్రకారం జిల్లా నుంచి మొత్తం 60 వేలమంది సభకు హాజరవుతారని తెలుస్తోంది. ఇంతభారీ సంఖ్యలో జనం హైదరాబాద్ వెళ్లేందుకు అంతస్థాయిలోనే వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒంగోలు నుంచి ఒక ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మహిళల కోసం దీన్ని కేటాయించారు. ఇక జిల్లా నుంచి 200 బస్సులను ఇప్పటికే మాట్లాడారు. అదనంగా మరో 60-80 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వాటితోపాటు పెద్ద సంఖ్యలో ఇతర వాహనాల్లో నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ వెళ్లనున్నారు. 
 
 నియోజకవర్గాలవారీగా సన్నాహాలు
 సమైక్య శంఖారావం సభ కోసం నియోజకవర్గాలవారీగా పార్టీ నేతలు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సభ విజయవంతం చేయడంపై మండల నేతలు, కార్యకర్తలతో చర్చించనున్నారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని సమైక్య శంఖారావం సభకు తరలివెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement