
వీరే జననేతదళం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నమ్మిన విలువలకు తిలోదకాలు ఇచ్చో; నమ్ముకున్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలో..పదవి కోసం పార్టీని పట్టుకుని వేలాడిన బాపతు నేత కాదు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సూర్యుని నుంచి కాంతిని వేరు చేయలేనంత సహజంగా విలువలకు కట్టుబడి; ప్రజలకు ఇచ్చిన మాటను తుచ తప్పక పాటించేందుకు పదవిని తృణప్రాయంగా పరిత్యజించి, ఆ ప్రజల ఆకాంక్షల పరిపూర్తికి పార్టీని స్థాపించిన ధీరుడాయన! జనాన్ని ఓట్లడగడానికి మాత్రమే వారి ముందుకు వచ్చే నాయకులకు కాలం చెల్లిందని, తమ పాట్లు, అగచాట్లను నిరంతరం పట్టించుకునే వాడు, తాము కంటతడి పెడితే ఎద కదిలేవాడు, తమ మధ్యకు కదిలి వచ్చే వాడినే జనం గుండెల్లో పెట్టుకుంటారని నిరూపించిన జనవీరుడాయన! ఇక- అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులంతా..సేనాని స్ఫూర్తితో, ఆయన ఆశయాలే ఆయుధంగా పోరాడే జన సైనికులుగా ఉండడంలో ఆశ్చర్యమేముంది! అభ్యర్థుల ఎంపిక.. ‘ప్రజల మనుషుల’నే వారి ప్రతినిధులుగా చట్టసభలకు పంపాలన్న జననేత ఆకాంక్షకు అద్దం పట్టడంలో అతిశయోక్తి ఏముంది!జిల్లాలో సార్వత్రిక సమరాంగణంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుశిక్షితులైన సైనికుల్లాంటి అభ్యర్థులను బరిలోకి దింపారు. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక కష్ట, నష్టాలకు ఎదురొడ్డి ప్రజల పక్షాన నిలిచి పోరాడిన వారిని గుర్తించి సీట్లు కేటాయించారు.
సోమవారం ఆయన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. నమ్ముకున్న వారికి పూర్తి న్యాయం చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తి ప్రతిఫలించింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక, ప్రాంతీయ సమతూకాలకు పెద్ద పీట వేశారు. టీడీపీ సవాలక్ష సమస్యలతో సతమతమవుతూ.. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయలేక, చేసిన స్థానాల్లో అసంతృప్తి జ్వాలలు మిన్నుమిట్టుతుండటంతో జాబితా వెల్లడికి మీనమేషాలు లెక్కిస్తోంది. ఇందుకు భిన్నంగా వైఎస్సార్ సీపీ ఒకేసారి జిల్లాలోని 18 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగలిగింది. ఎస్సీలకు రిజర్వు అయిన పి.గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది.
జగన్ ప్రకటించిన జాబితాపై పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవనే నానుడిని సైతం జగన్ తిరగరాసినట్టు జాబితా ఉందని పరిశీఅకులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో ఎస్సీ, కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాలదే కీలకపాత్ర. వీరిలో ఎస్సీలకు అమలాపురం పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు, రంపచోడవరం ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 15 స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో జగన్ సామాజిక సమతూకం పాటించి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఓట్ల పరంగా ఎస్సీల తరువాత అత్యధిక సంఖ్యాకులైన కాపులకు 8 అసెంబ్లీ సీట్లను కేటాయించడం ద్వారా ఆ సామాజికవర్గానికి పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని భరోసానిచ్చారు.
బీసీలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి కూడా సముచిత స్థానమే కల్పించారు. బీసీల జపం చేస్తూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించలేకపోయారు. బీసీలపై నిజమైన ప్రేమను కనబరిచిన మహానేత వైఎస్ మాదిరిగానే జగన్ జిల్లాలో శెట్టిబలిజ సామాజికవర్గానికి రామచంద్రపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం కేటాయించడంతో పాటు రాజమండ్రి సిటీ కూడా బీసీలకు ఇచ్చి మొత్తం జిల్లా నుంచి నలుగురికి అవకాశం ఇచ్చారు.
మహానేత వరవడిలోనే..
అభ్యర్థుల కూర్పులో కొత్తవారికి, యువతకు, సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడంలో జగన్ మహానేత వరవడినే అనుసరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చినప్పుడే పలువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి కొత్త సంప్రదాయాన్ని ఆవిష్కరించారు. కోనసీమలో దాదాపు అన్ని సామాజికవర్గాల్లో మంచి పట్టున్న మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఇటీవల ముమ్మిడివరంలో జరిగిన వైఎస్సార్ జనభేరిలో ప్రజల సమక్షంలోనే ప్రకటించారు. గత ఎన్నికల్లో కేంద్రమంత్రి పళ్లంరాజును ఢీకొన్న యువనేత చలమలశెట్టి సునీల్‌ను కాకినాడ నుంచి; ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు తనయుడు, ఉన్నత విద్యావంతుడు, పెద్దాడ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటరమణచౌదరిని రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఖరారు చేశారు.
శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి మహానేత వైఎస్‌కు సన్నిహితుడు, ‘వైఎస్సే నా అధిష్టానం’ అని మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను రామచంద్రపురం అభ్యర్థిగా ప్రకటించారు. కాపు సామాజికవర్గం నుంచి బలమైన నేతగా, జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూకు జగ్గంపేట సీటును కేటాయించారు. రాజానగరం అభ్యర్థిగా అదే సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు సతీమణి, సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మికి అవకాశం కల్పించారు.
మాటంటే చేతే..
గతంలో తానిచ్చిన మాటకు కట్టుబడి.. పిఠాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం స్థానాలను పెండెం దొరబాబు, వరుపుల సుబ్బారావు, తోట సుబ్బారావునాయుడులకు కేటాయించారు. 2009 ఎన్నికల్లో దొరబాబుకు టిక్కెట్టు ఇస్తానన్న తండ్రి వైఎస్ హామీ కారణాంతరాలతో నెరవేరని లోటును భర్తీ చేస్తానన్న హామీని అనుసరించి పిఠాపురం నుంచి ఆయననే బరిలోకి దింపారు. మాజీ ఎంపీ తోట గోపాలకృష్ణ మృతి చెందినప్పుడు ఆయన తనయుడు నాయుడికి సీటు ఇచ్చి సోదరుడిగా చూసుకుంటానన్న మాట ప్రకారం పెద్దాపురం సీటును కట్టబెట్టారు. మెట్ట ప్రాంతంలో మంచిపేరు సంపాదించుకుని, ఏ మారుమూల గ్రామంలోనైనా ఎవరినైనా పేరుపెట్టి పిలవగలిగే మాజీ ఎమ్మెల్యే వరుపులకు ప్రత్తిపాడు సీటు ఖాయం చేయడంతో ‘సుబ్బన్నా నీదే సీ’టంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
దక్షతకు, యువతకు అవకాశం
యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే సంకల్పంతో దాడిశెట్టి రాజాకు తుని నుంచి అవకాశం కల్పించారు. డీసీసీ అధ్యక్షుడిగా, జెడ్పీ చైర్మన్‌గా దక్షత కలిగిన చెల్లుబోయిన వేణుకు కాకినాడ రూరల్ సీటును, అన్ని సామాజికవర్గాల్లో పట్టున్న నాయకుడిగా, మొదలు పెట్టిన ఏ పనైనా పూర్తి అయ్యేవరకు విశ్రమించని తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి కాకినాడ సిటీ సీటును కేటాయించారు. సమితి ప్రెసిడెంట్‌గా, ఎంపీపీగా పనిచేసిన తండ్రి దివంగత అనంత చక్రరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యునిగా దక్షతను చాటిన యువనేత, పార్టీ యువజన విభాగం కన్వీనర్ ఉదయభాస్కర్‌ను రంపచోడవరం అభ్యర్థిగా ప్రకటించారు.
తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కొత్తపేట సీటును, పేదలకు ఉచితంగా వైద్యమందిస్తూ మంచి పేరు సంపాదించిన డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి అనపర్తి సీటును ఖాయం చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి మండపేట నియోజకవర్గంలో విస్తృతమైన బంధుత్వాలు కలిగిన గిరజాల స్వామినాయుడుకు ఆ సీటును కేటాయించారు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా గొల్ల బాబూరావుకు అమలాపురం ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు ఖరారుచేశారు. గ్రామీణ నీటిపారుదలశాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పనిచేసి, కోనసీమలో చాలా గ్రామాలకు మంచినీరందించిన బొంతు రాజేశ్వరరావుకు రాజోలు సీటును ఖరారు చేశారు.
రాజమండ్రిలో ప్రముఖ వ్యాపారి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా పనిచేసిన ఆకుల వీర్రాజుకు రాజమండ్రి రూరల్ స్థానాన్ని కేటాయించారు. ముమ్మిడివరం, పి.గన్నవరం మండలాలకు ఎంపీపీగా పని చేసిన గుత్తుల సాయికి ముమ్మిడివరం, పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పని చేసిన ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్‌కుమార్‌కు రాజమండ్రి సిటీ సీటును ఖరారు చేశారు. ఈ రకంగా అభ్యర్థుల ఎంపికలో అన్ని రంగాలకు, భిన్న వర్గాలకు చెందిన వారికి సముచిత స్థానం కల్పించి సమతూకం పాటించినట్టయింది.